09-09-2025 06:43:23 PM
ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి ఇల్లందు ఏరియాలోని జి.యం కార్యాలయంలో ప్రజా కవి కాళోజి నారాయణరావు 111వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏరియా జనరల్ మేనేజర్ వి.కృష్ణయ్య(Area General Manager Krishnaiah) హాజరయ్యారు. ముందుగా చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జి.యం మాట్లాడుతూ.. కాళోజి నారాయణరావు 1914 సెప్టెంబర్ 9న కర్ణాటకలోని బీజాపూర్ జిల్లాలోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించారన్నారు. ఆయన తల్లి రమాబాయమ్మ కర్ణాటకకు చెందినవారు. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రకు చెందినవారని, వారు మడికొండలో ప్రాథమిక విద్యను, వరంగల్, హైదరాబాద్‌లో ఉన్నత విద్యను పూర్తి చేశారని తెలిపారు. కాళోజీ బహుభాషావేత్త. చిన్నప్పటి నుండే తెలుగు చదివినప్పటికీ, మరాఠీ, కన్నడ, హిందీ, ఉర్దూ భాషలలో కూడా కవిత్వం రాశారన్నారు. హైదరాబాద్ రాష్ట్ర స్వాతంత్య్ర ఉద్యమంలో భాగం, నిజాం పాలనలో జైలు శిక్ష అనుభవించారని తెలిపారు.
1953లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యాడని, 1958లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యారన్నారు. కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయగా, భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సత్కరించిందని తెలిపారు. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ "సామాన్యుడే నా దేవుడు" అని ప్రకటించిన కాళోజీ 2002 నవంబరు 13 న తుదిశ్వాస విడిచారని అన్నారు. 2015 సెప్టెంబర్ 9వ తేది నుండి తెలంగాణ బాష దినోత్సవం గా ఆయన జయంతిని జరుపుకుంటునమని అన్నారు. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత, తెలంగాణ ప్రభుత్వం "కాళోజీ నారాయణరావు ఆరోగ్య వి శాస్త్ర విశ్వవిద్యాలయం" అనే కొత్త విశ్వ విద్యాలయాన్ని స్థాపించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో ఏరియా సేఫ్టీ అధికారి జాకీర్ హుస్సేన్, ఏరియా ఇంజనీర్ నరసింహరాజు, డీజియం(సివిల్) రవికుమార్, డీజియం (ఫైనాన్స్) మధు బాబు, జి.శివ వీరకుమార్, కే.రాందాస్, యస్.దిలీప్ కుమార్, యన్. సతీష్, బి. శ్యాం ప్రసాద్, సుధాకర్ అధికారుల సంఘం నుంచి నాగేశ్వర్ రావు, గుర్తింపు సంఘం నుంచి లచ్చిరాం, ప్రాతినిధ్యసంఘం నుంచి యాదిగిరి ఇతర ఉన్నత అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు.