09-09-2025 11:47:37 PM
చివ్వెంల: అక్కలదేవిగూడెం గ్రామ శివారులో రోడ్డు ప్రమాదంలో కూలీలకు గాయాలైన సంఘటన ఈ రోజు సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఖమ్మం నుంచి సూర్యాపేట వైపు వెళుతున్న ఆటోను వెనుక నుంచి అతివేగంగా అశోక్ లేలాండ్ వాహనం గుద్ధి అదుపుతప్పి పక్కన ఉన్న డివైడర్ ను ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న పెదనేమిల గ్రామానికి చెందిన వ్యక్తులు కూలి పనికి వెళ్లి పని ముగించుకొని తిరిగి తమ స్వగ్రామానికి వెళుతున్నారు. ఈ క్రమంలో అక్కలదేవిగూడెం గ్రామ శివారులో అశోక్ లేలాండ్ వాహనం అతివేగంగా వచ్చి ఆటోను వెనుక నుంచి ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది కూలీలకు గాయాలైనట్టు సమాచారం. వెంటనే స్పందించిన జాతీయ రహదారి సిబ్బంది మరియు గ్రామ ప్రజలు ట్రాఫిక్ కు ఆటంకం కలగకుండా రోడ్డుపై పడి ఉన్న వాహనాలను పక్కనపెట్టి గాయాలైన కూలీలను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు .