calender_icon.png 10 September, 2025 | 4:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూరియా కోసం రైతన్నల పడిగాపులు

09-09-2025 11:37:11 PM

కొద్దిమంది రైతులకే యూరియా బస్తాలు పంపిణీ చేయడం పట్ల రైతుల ఆగ్రహం..

రైతులతో మాట్లాడి శాంతింప చేసిన ఎస్ఐ చలికంటి నరేష్..

గరిడేపల్లి (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా(Suryapet District) గరిడేపల్లి మండలంలో యూరియా కోసం రైతులు పడిగాపులు కాసే పరిస్థితి కొనసాగుతోంది. మంగళవారం మండల కేంద్రంలోని మన గ్రోమోర్ సెంటర్ కు 600 బస్తాల యూరియా చేరుకోగా,రైతులు ఆధార్ కార్డులతో పొడవాటి క్యూ లైన్లలో నిలబడ్డారు. అయితే అక్కడ రైతులందరి ఆధార్ కార్డులు సేకరించి, కేవలం15 నుంచి 20 మందికి మాత్రమే తలా రెండు బస్తాలు ఇచ్చి, మిగతావారి ఆధార్ కార్డ్ లను స్టాక్ అయిపోయిందని బయటికి విసిరేయడంతో వారు ఆగ్రహానికి గురయ్యారు. రైతులు 600 బస్తాలు దిగుమతి జరిగితే, కేవలం 20 మందికే ఎలా ఇచ్చారు...? మిగతా బస్తాలు ఎక్కడకు వెళ్లాయి? అని ప్రశ్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న గరిడేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి వారిని శాంతింప చేశారు.

మండల వ్యవసాయ అధికారి ప్రీతం కుమార్ మాట్లాడుతూ, గరిడేపల్లి మండలానికి సుమారు 5000 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉండగా, ఇప్పటివరకు కేవలం 3000 మెట్రిక్ టన్నులు మాత్రమే అందాయని, ఇంకా 2000 మెట్రిక్ టన్నులు త్వరలో రానున్నాయి అని తెలిపారు. అయితే ఇప్పటికే నాట్లు వేసి15–20 రోజులు అయినా,యూరియా అందకపోవడంతో పంట దిగుబడులు తగ్గే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.బ్లాక్ మార్కెట్‌లో యూరియా ఇక మరోవైపు, మండలంలో యూరియా బ్లాక్ మార్కెట్‌కి చేరుతోందని రైతులు ఆరోపిస్తున్నారు.కొన్ని ప్రైవేట్ ఎరువుల దుకాణాల్లో యూరియా బస్తా కోసం ₹500 నుంచి ₹600 వరకు వసూలు చేస్తున్నారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.యూరియా అక్రమ దందా ఎలా జరుగుతోందో అధికారులు విచారణ చేసి,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.