09-09-2025 11:41:52 PM
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్...
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం ఎప్పటికప్పుడు పూర్తి చేస్తూ ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పురోగతిపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అవసరమైన ముడి సరుకులు, మ్యాన్ పవర్ అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు.
ఇప్పటివరకు మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి లభించిన అనుమతులు, వివిధ దశల వారిగా నిర్మాణం పూర్తయిన ఇండ్లకు సంబంధించి వివరాలను మండలాల వారిగా సమీక్షించారు. మండల ప్రత్యేక అధికారులు ఎప్పటికప్పుడు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రక్రియను పర్యవేక్షించాలని అన్నారు. ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక కష్టాలు ఉన్న వారిని గుర్తించి, మహిళా సంఘాల ద్వారా రుణాలు ఇప్పించాలని పేర్కొన్నారు. ఇసుక కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, హౌసింగ్ పిడి రాజేశ్వర్, మండల ప్రత్యేక అధికారులు, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.