calender_icon.png 10 September, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్ణీత సమయంలో పనులు పూర్తి చేయాలి

10-09-2025 12:04:02 AM

  1. మేడారం జాతరపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి
  2. రూ. 150 కోట్లతో భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు
  3. భక్తులకు అమ్మవార్లపై భక్తి విశ్వాసం పెంపొందించాలి 
  4. రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క

ములుగు, సెప్టెంబరు9 (విజయక్రాంతి): మేడారం శ్రీసమ్మక్క సారలమ్మ మహా జాతరను పురస్కరించుకొని వచ్చే సంవత్సరం జనవరి 28నుండి 31వ తేదీ వరకు జరగనున్న జాతరలో భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని, మేడారంలో జరుగునున్న పనులను పరిశీలించడానికి వారంలోగా ముఖ్యమంత్రి మేడారాన్ని పర్యటిస్తారని రాష్ట్ర పంచాయతీ రాజ్ మంత్రి సీతక్క అన్నారు.

మంగళవారం జిల్లాలోని ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఎస్పీ డాక్టర్ శబరిష్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచంద్రలతో కలసి ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న విఐపి పార్కింగ్ రోడ్డు, పోలీస్ కంట్రోల్ రూమ్, హరిత హోటల్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం మేడారంలోని ఐటీడీఏ సమావేశపు హాల్లో అమ్మవార్ల పూజారులు, అన్ని శాఖల అధికారులతో శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర 2026 పై సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ భక్తుల సౌకర్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 150 కోట్ల రూపాయలను కేటాయించిందని కేటాయించిన నిధులతో ఆయా శాఖల అధికా రులు 100రోజుల నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గద్దెల ప్రాంతంలో పూజారుల మనోభావాలు దెబ్బ తినకుండా వారి సూచనలు మేరకు నూతన హంగులతో శ్వాశ తంగా నిలిచిపోయేలా పనులు చేయాలని, మేడారం గ్రామస్తులు పూజార్ల అభిప్రాయాలను సైతం పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.

రాష్ట్ర పండుగనే కాకుండా మరో కుంభమేళా తరహలో జరగనున్న జాతరకు సామాన్య పౌరుని నుండి రాష్ట్రపతి, ప్రధానమంత్రి లాంటి ముఖ్యులు హాజరయ్యే అవకాశం ఉన్నందున వివిఐపిలకు ఇబ్బందులు రాకుండా విమానాలు సైతం దిగే విధంగా ఏర్పాట్లు చేయాలని అన్నారు.  దేవుళ్ళు కలిగిన ప్రాంతంలో రాజకీయాలు చేసే ఏ రాజకీయ నాయకుడు ఎదగలేదని, రానున్న మహా జాతరను విజయవంతం చేయడానికి అన్ని శాఖల అధికారులు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుని సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు.

భక్తులకు అమ్మవార్లపై భక్తి విశ్వాసం పెంపొందించేలా జాతర ఏర్పాట్లు చేయాలని ఆమె సూచించారు. ప్లీచ్ ఇండి యా ఫౌండేషన్ స్థపతి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ ఈ శివ నాగిరెడ్డి, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, పూజారుల సంఘం అధ్యక్షుడు జగ్గరావు, ఈఓ వీరస్వామి, ఆర్కేటెక్చర్, ఇంజనీరింగ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

గ్రామ గ్రామానికి సిసి రోడ్ల.

ములుగు, వెంకటపూర్ సెప్టెంబరు9 (విజయక్రాంతి): మారుమూల, గ్రామీణ ప్రాం తాలను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో అన్ని గ్రామాలలో నూతనంగా సీసీ రోడ్లను ఏర్పాటు చేస్తున్నామని, రానున్న రోజులలో అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని   మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క అన్నారు.

మంగళవారం వెంకటపూర్ మండలంలో సింగార కుంటపల్లె కొత్త గ్రామ పంచాయతీ భవనం అంచనా 20 లక్షలు, నర్సాపూర్లో అంతర్గత సిసి రోడ్లు (08 వరక్స్) అంచన 40 లక్షలు, నారాయణగిరిపల్లి అంగన్వాడి భవనం అంచనా 12 లక్షల నిర్మాణ పనులను మంత్రి సీతక్క శంకుస్థాపన, నారాయణగిరిపల్లిలో పనులను ప్రారంభించారు.

జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారి 163నుండి మదనపల్లి క్రాస్ రోడ్డు వరకు నాలుగు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేయనున్న రోడ్డు వెడల్పు,డివైడర్,సెంటర్ లైటింగ్ పనులను శంకుస్థాపన చేశారు. 

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయడమే కాకుండా ఇప్పటికీ రోడ్డు సౌకర్యం లేని గ్రామాలకు పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడానికి ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించిందని వివరించారు.

ఇప్పటికే జిల్లా కేంద్రం నుండి పలు గ్రామాలకు వెళ్లే రహదారులను విస్తరించి పనులను పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. బతుకమ్మ పండుగ వరకు రోడ్డు పనులను,నాణ్యత లోపించకుండా పూర్తి చేయాలని సంబంధిత అధికా రులను సూచించారు.  మున్సిపల్ కమిషనర్ సంపత్, పంచాయతీ రాజ్ ఈఈ అజయ్ కుమార్, ప్రజా ప్రతినిధులు,సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

‘ర్యాంప్  వుమెన్ అక్సెలేరేషన్  ప్రోగ్రాం‘ పైన అవగాహన 

మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమా లను చేపడుతోందని మంత్రి సీతక్క అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వీ హబ్  ఆధ్వర్యంలో జిల్లాలోని SHG మహిళలు, మహిళా పరిశ్రా మికవేత్తలకు ర్యాంప్ (రైసింగ్ అండ్ యాక్సిలరేటింగ్  MSME పెర్ఫార్మెన్స్ స్కీమ్) ప్రోగ్రాం  పైన అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ‘మహిళలను ఆర్థికంగా పరిపుష్టం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మహిళాశక్తి లో బాగంగా ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తోందన్నారు. దానిలో భాగంగానే  వీ హబ్ మహిళలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను చేపడుతోందని అన్నారు. వీ హబ్ ఇంప్లిమెంట్ చేస్తున్న రామ్ ప్రోగ్రాం ను సద్వినియోగం చేసుకొని మహిళలు తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవాలని అన్నారు.