05-01-2026 01:06:30 AM
పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ
మంచిర్యాల, జనవరి 4 (విజయక్రాంతి): ఇండియాకు చైనా, ఉక్రెయిన్ నుంచి యూరి యా దిగుమతి చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ పేర్కొన్నారు. ఆది వారం హైటెక్ సిటీలోని ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఎంపీ మాట్లాడారు. రామగుండంలోని ఆర్‌ఎఫ్‌సీఎల్ ప్లాంట్ ను సరిగా నడపకపోవడంతో 12 లక్షల మెట్రిక్ టన్నులకు బదులు 9 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగిందని, దీనితో జిల్లా రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చిందన్నారు. త్వరలో రామగుండం ఎయిర్‌పోర్టు కల సహకారం కానుందన్నారు. మందమర్రిలో లెదర్ పార్క్, మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తున్నానని, త్వరలోనే పెద్దపల్లి, మణుగూరు రైల్వే లైన్ కోసం రూ. 4 వేల కోట్ల నిధులతో పనులు ప్రారంభం కానున్నాయన్నారు.
ఉపాధి హామీలో కూలీల పని దినాలను 100 నుంచి 60కి కుదించి, రూ. 90 వేల కోట్ల నిధులు తగ్గించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 : 40 రేషియోలో కేటాయించడం దుర్మార్గమన్నారు. మహాత్మా గాంధీ పేరు లేకుండా చేయాలనేదే బిజెపి కుట్ర అని దుయ్యబట్టారు. బీహార్ ఎన్నికల ముందు బీజేపీ ప్రభుత్వం ఇంటికి పదివేల రూపాయలు ప్రకటించడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఎంపీ, చెన్నూర్ మాజీ ఎంఎల్‌ఏ బాల్క సుమన్ రూ. 3 వేల నుంచి రూ. 5 వేల కోట్ల ఇసుక స్కామ్ చేశాడని ఎంపీ వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయాన్ని కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి సందర్శించారు. రెడ్డి కాలనీలోని అయ్యప్ప దేవాలయాన్ని ఎంపీ సందర్శించి భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు జరిపారు. ఈ విలేకరుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు పిన్నింటి రఘునాథ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మోడల్ స్కూల్ను సందర్శించిన ఎంపీ
జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ మోడల్ స్కూల్ను ఆది వారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించారు. పాఠశాలలో అందుతున్న సదుపాయాలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతులు, భవిష్యత్తులో కల్పించాల్సిన సదుపాయాలపై అధికారులతో చర్చించారు. అనంతరం విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు.