calender_icon.png 25 November, 2025 | 12:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర బడ్జెట్‌ను సవరించాలి..

10-02-2025 11:24:22 PM

విభజన హామీలు అమలయ్యే వరకు పోరాడుతాం..

ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పలువరు వక్తలు...

ముషీరాబాద్ (విజయక్రాంతి): కార్పొరేట్ అనుకూల కేంద్ర బడ్జెట్‌ను సవరించే వరకు రాష్ట్ర విభజన హామీలు అమలయ్యే వరకు సమస్యలపై ఐక్య ఉద్యమాలు నిర్వహించాలని పలువరు వక్తలు పేర్కొన్నారు.  ఈ మేరకు సోమవారం ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వేదిక రాష్ట్ర కన్వీనర్ ఎస్. వీరయ్య, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్‌వెస్లీ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమ్మినేనీ వీరభద్రంలు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి, బడ్జెట్ ఆదానీ, అంబానీలకు మేలు చేకూర్చే విధంగా రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, దళితులు, గిరిజనులు, బలహీనవర్గాలు, మైనారిటీలు, మహిళలకు వ్యతిరేకంగా ఉన్నదని అన్నారు. విద్యా, వైద్య రంగాలను ప్రజలకు దూరం చేసే విధంగా ఉన్నదని, ఉపాధి అవకాశాలను దెబ్బతీనే  విధంగా ఉన్నదని అన్నారు.

దీనిని సవరించే వరకు ఐక్యంగా పోరాడుతామని వారు పేర్కొన్నారు. ఉద్యోగులకు పన్ను మినహాయింపులు ఇస్తున్నామని తెలంగాణ నుండి ఎన్నికైన కేంద్ర మంత్రులు గోరంత చేసి కొండంత చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వాస్తవంగా ఉద్యోగులకు 30 శాతం పన్ను విధించి, కార్పొరేట్ల నుండి మాత్రం 22 శాతం పన్ను మాత్రమే వసూలు చేస్తున్నారని అన్నారు. కార్మికుల కనీస వేతనాల గురించి పట్టించుకోలేదని, రైతుల పరంపరను నివారించే ప్రయత్నం చేయలేదని అన్నారు. ఎరువుల సబ్సీడీకి కోత విధించారన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి కోతలు పెట్టారని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి విభజన హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదని అన్నారు.

బయ్యారం ఉక్కు ప్యాక్టరీ, ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, హైస్పీడ్ రైల్వే లైన్, ప్రాజెక్టులకు జాతీయ హోదా ఏ ఒక్కటి ఈ బడ్జెట్‌లో పెట్టలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి 8 మంది ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికి ఏమీ సాధించలేకపోయారని అన్నారు. ఎస్. వీరయ్య, చుక్కా రాములు, జూలకంటి రండారెడ్డి, స్కైలాబ్ బాబు, ఎంవీ రమణ, ధర్మానాయక్‌లు అధ్యక్షత వహించగా ప్రజా సంఘాల నాయకులు పాలడుగు భాస్కర్, టి. సాగర్, ఆర్. వెంకట్ రాములు, మల్లు లక్ష్మీ, ఎండీ అబ్బాస్, ఆర్. శ్రీరామ్ నాయక్, బండారు రవి, ఫైళ్ల ఆశయ్య, ఉడత రవీందర్, గోరెంకల నరసింహ, కట్టా నరసింహా, హిమబిందు, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి. నాగరాజు తదితరులు పాల్గొన్నారు.