31-07-2025 11:23:17 PM
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
గరిడేపల్లి: కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే కుట్ర పన్నుతున్నారని సిపిఎం పార్టీరాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు,మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మండలంలోని కీతవారిగూడెంలో మాజీ సర్పంచ్, సీనియర్ కమ్యూనిస్టు నాయకులు రాచమల్ల రామస్వామి సంతాప సభ గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. రైతులకు కూలీలకు కార్మికులకు ఎంతో కొంత న్యాయం జరిగిందంటే అది కమ్యూనిస్టుల వలన జరిగిందని తెలిపారు. రైతు కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేసి అనుకూలమైన చట్టాలు తీసుకురావడంలో ఎర్రజెండా చేసిన పోరాటం మరువలేనిది అన్నారు.
రాయినిగూడెం సర్పంచిగా పనిచేసిన రామస్వామి సీనియర్ కమ్యూనిస్టు నాయకులను,ఆయన ఈ ప్రాంత ఎర్రజెండా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని తెలిపారు. ఎర్రజెండా లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు ఎనలేని కృషి చేశారని తెలిపారు.ఎర్రజెండా సిద్ధాంతాన్ని నమ్మి చివరి వరకు ప్రజల కోసం పనిచేసిన రామస్వామి చిరస్మరణీయుడు అన్నారు.సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి మాట్లాడుతూ నీతిగా,నిజాయితీగా,నిబద్ధతతో కూడిన రాజకీయ నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న రామస్వామి ఎర్రజెండా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు.మొదట స్వర్గీయ రాచమల్ల రామస్వామి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.