calender_icon.png 21 November, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర ప్రభుత్వ పథకాలు సకాలంలో లబ్ధిదారులకు అందాలి

21-11-2025 12:26:43 AM

  1. అన్ని శాఖల అధికారులు అంకితభావంతో పనిచేయాలి

మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు అండ్ దిశా కమిటీ ఛైర్మన్ పోరిక బలరాం నాయక్

దిశా సమావేశానికి హాజరైన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు

ములుగు,నవంబరు20(విజయక్రాంతి):కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ అభివృద్ధి,సంక్షేమ పథకాలపై నిరంతర పర్యవేక్షణ చేయాలని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు అండ్ దిశా కమిటీ ఛైర్మన్ పోరిక బలరాం నాయక్ తెలిపారు.గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గ్రామీణాభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన దిశా కమిటీ సమావేశం పోరిక బలరాం నాయక్ అధ్యక్షతన జరిగింది.

ఈ సమావేశంనకు భద్రాచలం నియోజకవర్గం శాసన సభ్యులు తెల్లం వెంకట్రావు,జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్, దిశ కమిటి మెంబర్ పూర్ణచందర్, జిల్లా అదనపు కలెక్టర్లు మహేందర్ జీ (రెవెన్యూ) పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీ దిశా కమిటీ చైర్మన్ మాట్లాడుతూ జిల్లాలో వనరులు పుష్కలంగా ఉన్నాయని సద్వినియోగం చేసుకుని అభివృద్ధి సాధించాలని సూచించారు.

జిల్లాలో పనిచేస్తున్న అన్ని శాఖల అధికారులు అంకిత భావంతో పనిచేస్తూ జిల్లా అభివృద్ధికి సహకరించాలని అన్నారు. జిల్లాలో చేపట్టే అభివృద్ధి పనులపై ఆయా శాఖల అధికారులు అంచనాలు తయారు చేసి సమర్పించిన పక్షంలో కేంద్రం నుండి నిధులు తేవడానికి సహకరిస్తానని, అధికారులు ఏజెన్సీ ప్రాంతంలో పనిచేయడం అదృష్టంగా భావించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా రావాల్సిన అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో రాబట్టుకొని ప్రజా ప్రతినిధులు అధికారుల సహకారంతో జిల్లాను ప్రగతి పథంలో తీసుకెళ్తామని అన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళిక ప్రకారం ప్రజల ప్రయోజనార్ధం అమలు చేసే ప్రతి పథకం గురించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు అవి అర్హులైన లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో కోల్ స్టోరేజ్, గోదాం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాలని సూచించారు. చేప పిల్లల పెంపకంపై జిల్లాలోని 67 సంఘాలకు అవగాహన కల్పించాలన్నారు.

జిల్లాలో కావాల్సిన చెక్ డ్యాముల ప్రతి వాదనలు పంపించాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. నేషనల్ హైవే 163 జంగాలపల్లి నుండి పసర ఫోర్ లైన్ పనులు ప్రారంభించాలని, జలగలంచ, కృష్ణాపురం, టేకులగూడెం బ్రిడ్జిల నిర్మాణం ప్రపోజల్స్ సమర్పించాలన్నారు. ఉపాధి హామీ పనులను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.

భూభారతి దరఖాస్తుల పరిశీలనలో రాష్ట్రంలో జిల్లాను 3వ స్థానంలో నిలిపినందుకు జిల్లా యంత్రాంగాన్ని ఈ సందర్భంగా అభినందించారు.జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతి లో జిల్లా ను నాల్గవ స్థానంలో నిలిపినందుకు జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారుల కృషిని అభినందించారు. ఇందిరమ్మ ఇండ్ల పురోగతిలో ఉన్న వివిధ సమస్యల పరిష్కారానికి అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు.