21-11-2025 12:28:42 AM
- నేటి నుంచి రెండు రోజులపాటు ఉత్సవాలు
- మొదటి రోజు సాయంత్రం గంధం ఊరేగింపు
- శనివారం దీపారాధన
- ఏర్పాట్లు పూర్తిచేసిన నిర్వాహకులు
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), నవంబర్20: తెలంగాణలో ప్రసిద్ధి గాంచి,మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన అర్వపల్లి సమీపంలోని హజ్రత్ సయ్యద్ ఖాజా నసీరుద్దీన్ బాబా దర్గా ఉర్సుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఈ ఉత్సవాలు శుక్ర,శనివారాల్లో రెండు రోజులపాటు జరగనున్నాయి.ఎప్పటినుంచో వస్తున్న సాంప్రదాయం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4గంటలకు అర్వపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గంధం ఊరేగింపు మొదలవుతుంది.
ఈ గంధం ఊరేగింపు రాత్రి9 గంటల వరకు దర్గాకు చేరుకుంటుంది.గంధం పాత్రలను ప్రజాప్రతినిధులు,పోలీసు,వక్స్ బోర్డుతో పాటు వివిధ శాఖల అధికారులు ఎత్తుకొని గ్రామ శివారు వరకు ఊరేగింపులో పాల్గొంటారు. అనంతరం దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు.ఇదే రోజు రాత్రి హైదరాబాద్ వారిచే కవ్వాలి కార్యక్రమం ఉంటుంది.
ఈ కార్యక్రమాన్ని వేల సంఖ్యలో భక్తులు తిలకిస్తారు. అలాగే శనివారం సాయంత్రం దీపారాధన (చిరాగ్) కార్యక్రమం జరుగుతుందని దర్గా వక్స్ బోర్డు ఇన్స్పెక్టర్ షేక్ మహమూద్ తెలిపారు. రాష్ర్టం నలుమూలల నుంచి తరలి రానున్న భక్తులు ఏడాదికోసారి అత్యంత వైభవంగా జరిగే ఉర్సుకు రాష్ర్టం నలుమూలల నుంచి హిందూ,ముస్లిం భక్తులు తరలిరానున్నారు.అయితే వక్స్ బోర్డు ఆధ్వర్యంలో ఉర్సుకు ఏర్పాటు చేశారు.నీటి వసతి కల్పించారు.
ఉర్సుకు వచ్చే భక్తులకు ఇబ్బందులు రాకుండా ఫార్మేషన్ రోడ్డును తాత్కాలికంగా మరమ్మత్తులు చేశారు.ఉర్సు సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారులు తరలివచ్చి దుకాణాలను ఏర్పాటు చేశారు.ఇదిలా ఉంటే ఉర్సు సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నట్లు స్థానిక ఎస్సు ఈట సైదులు తెలిపారు.ఉర్సు ప్రశాంతంగా జరగడానికి భక్తులు,నిర్వాహకులు సహకరించాలని కోరారు.