17-12-2025 01:47:59 AM
హైదరాబాద్ సీపీ సజ్జనార్
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 16 (విజయక్రాంతి): కనిపెంచిన తల్లిదండ్రులను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బిడ్డలే.. ఆస్తులు రాయించుకుని వారిని రోడ్డున పడేస్తున్నారని, వృద్ధాప్యంలో వారికి అండగా ఉం డాల్సింది పోయి అనాథలుగా మారుస్తున్నారని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ఇటీవల కాలంలో తన వద్దకు వస్తున్న వృద్ధుల ఫిర్యాదులను చూసి ఆయన చలించిపోయారు.సీపీ మాట్లాడుతూ.. ‘కొంతకాలంగా చాలామంది వృద్ధులు ఫిర్యాదులతో నన్ను కలుస్తున్నారు.
ఆస్తులన్నీ రాయించుకు ని తమను చిన్న గదిలో బంధించారని, లేదా రోడ్డుపై వదిలేశారని కన్నీరుమున్నీరవుతున్నారు. రోజు గడవడమే కష్టంగా మారిందని, తమను ఏదైనా వృద్ధాశ్రమంలో చేర్పించాలని వేడుకుంటున్నారు.ఈ కేసులు చూస్తుం టే చాలా బాధ కలుగుతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల బాగోగులు చూడటం బిడ్డల కనీస ధర్మమని సీపీ హితవు పలికారు.
‘ఈ రోజు మీరు యవ్వనంలో ఉండి తల్లిదండ్రులను చిన్నచూపు చూస్తున్నారేమో.. కానీ, రేపు మీరు కూడా వృద్ధులు అవుతారు. అప్పుడు మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఇలాగే ట్రీట్ చేస్తారు. ఆ రోజు బాధపడినా ప్రయోజనం ఉండదు’ అని హెచ్చరించారు. వృద్ధ తల్లిదండ్రుల సంరక్షణ చట్టం ప్రకారం బాధ్యత విస్మరించిన పిల్లలపై చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు.