calender_icon.png 14 August, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీకి చక్రధర్‌గౌడ్ రాజీనామా

11-08-2025 12:39:51 AM

-పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్‌కు రాజీనామా పత్రం

-ఇన్ని రోజులు పార్టీలో ఆదరించినందుకు కృతజ్ఞతలు

-కాంగ్రెస్ పార్టీలో రౌడీలు, కబ్జాదారులకే ఆదరణ

సిద్దిపేట, ఆగస్టు 10 (విజయక్రాంతి): సిద్దిపేటకు ఎలాంటి సంబంధం లేని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు సిద్దిపేటలో కబ్జాదారులను, రౌడీషీటర్ లను ప్రోత్సహించడం పార్టీకి పెను ప్రమాదమని ఫార్మర్ ఫస్ట్ సంస్థ వ్యవస్థాపకులు చక్రధర్ గౌడ్ అన్నారు. ఆదివారం సిద్దిపేటలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చక్రధర్ గౌడ్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ తనకున్న రాజకీయ నాయకుల పరిచయం తో అనేక పదవులు అనుభవించాల్సిన అవకాశం ఉన్నదని కానీ అధికార పార్టీలో ఉంటూ పార్టీకి రాజీనామా చేయడానికి ప్రధాన కారణం మైనంపల్లి హనుమంతరావు పనితీరని వెల్లడించారు.

గత ప్రభుత్వంలో బి.ఆర్.ఎస్ నాయకులుగా చలామణి అయినవారు, రౌడీషీటర్లుగా, భూకబ్జాలకు పాల్పడి తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అధికార పార్టీలో చేరిన వారిని మైనంపల్లి హనుమంతరావు ప్రోత్సహించడం దురదృష్టకరమన్నారు. తన పట్ల అసభ్య పదజాలంతో దూషించిన, మాట్లాడిన వారి వ్యవహార తీరు తనను మానసికంగా కృంగదీసిందని అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు.

మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తన ఫోన్ టాపింగ్ చేశాడంటూ ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించిన చక్రధర్ గౌడ్ అధికార పార్టీ కాంగ్రెస్ కు రాజీనామా చేయడం సిద్దిపేటలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతోనే చక్రధర్ గౌడ్ హరీష్ రావు పై ఆరోపణలు చేస్తున్నారంటూ విమర్శలు వినిపించాయి. మరి చక్రధర్ గౌడ్ అధికార పార్టీకి రాజీనామా చేయడం తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనేది అందరిని ఆలోచింపజేస్తున్నాయి. చక్రధర్ గౌడ్ ఏ పార్టీలో చేరుతాడని స్పష్టత రాకపోవడంతో కొంతమేరకు ఉత్కంఠ నెలకొన్నది.