calender_icon.png 7 August, 2025 | 12:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

42% బీసీ కోటా అమలుకు సవాళ్లు

25-07-2025 12:00:00 AM

డాక్టర్ శివ ముదిరాజ్ :

* రాష్ట్రప్రభుత్వం వెంటనే కులగణన డేటాను బహిర్గతం చేయాలి. వెనుకబడిన కులాల స్థితిగతులను శాస్త్రీయంగా నిర్ధారించాలి. అంబశంకర్ కమిషన్ తరహాలో రిజర్వేషన్‌ను సమర్థించే నివేదికను సిద్ధం చేయాలి. రిజర్వేషన్ చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చాలి. తద్వారా చట్టపరమైన రక్షణ సాధించాలి. 

తెలంగాణ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలోని సెక్షన్- 285ను సవరించి స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని నిర్ణయించింది. ఈ ప్రయత్నం రాజకీయంగా ఆకర్షణీయమైనప్పటికీ, రాజ్యాంగ బద్ధమైన పరిమితులు, సుప్రీం కోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. భారత రాజ్యాంగం ఆర్టికల్- 38 ప్రకారం.. బలహీన వర్గాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వా న్ని సాధించేందుకు ప్రభుత్వాలు వారి కోసం సంక్షేమ పథకాలు అమలు చేయా లి.

అలాగే రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 (4), 16(4) విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లను కల్పించే అధికారాన్ని రాష్ట్రాలకు ఇచ్చాయి. అయితే, అమలు చేయడం అంత సులభం కాదు. అందుకు ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. చంపకం దొరైరాజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు (1951) కేసులో సుప్రీం కోర్టు తమిళనాడులో బీసీ రిజర్వేషన్లు చెల్లవని తేల్చింది. దీంతో మొదటి రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 15(4)ను చేర్చాల్సి వచ్చింది. 

ఎంఆర్ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ (1963) కేసులో రిజర్వేషన్లు 50శాతం సీలింగ్‌కు లోబడి ఉండాలని, అతిగా రిజర్వేషన్ ఆర్టికల్ 15(1)ను ఉల్లంఘిస్తుందని న్యాయస్థానం తీర్పునిచ్చింది. అనంతరామన్ కమిషన్ 1970లో బీసీలకు రిజర్వేషన్ల అమలుకు శాస్త్రీయ ఆధా రాలను సిఫారసు చేసింది.

ఇందిరా సహా ని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1992) కేసులో రిజర్వేషన్లు 50 శాతం సీలింగ్‌ను మించకూడదని, కులాన్ని బీసీల గుర్తింపుకు ప్రధాన ఆధారంగా పరిగణించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కృష్ణమూర్తి కేసు (2010)లో స్థానిక సం స్థల రిజర్వేషన్లకు ‘ట్రిపుల్ టెస్ట్’ (సమగ్ర సర్వే, శాస్త్రీయ డేటా, 50% సీలింగ్) నిబంధన అమలు చేయాలని పేర్కొన్నది.

జై శ్రీ లక్ష్మణరావు పాటిల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ర్ట (2021) కేసులో మహారాష్ట్ర లో మరాఠాలకు 16 శాతం రిజర్వేషన్ 50శాతం సీలింగ్‌ను మించినందున న్యాయస్థానం ఆ నిర్ణయాన్ని రద్దు చేసింది.   ఆ రిజర్వేషన్లను 42 శాతం పెంచాలని, అందుకు చట్ట సవరణ ప్రయత్నం జరుగుతున్నది. కానీ, ఇది చట్టపరమైన సమీక్షలో ఆ ప్రయత్నం నిలబడే అవకాశాలు చాలా తక్కువ.

కులగణన డేటా ప్రకారం..

2023 కులగణన సర్వే ప్రకారం మొ త్తం రాష్ట్ర జనాభా:3.50కోట్లు (96.9 శాతం). వీరిలో బీసీ జనాభా 46.25 శాతం (సుమారు 1.62 కోట్లు). ముస్లిం మైనారిటీ బీసీ జనాభా 10.08 శాతం (సుమారు 35.28 లక్షలు). మొత్తం కలిపితే బీసీ జనాభా:56.33శాతం(సుమారు 1.97 కోట్లు).అలాగే ఎస్సీ జనాభా:15.45 శాతం (సుమారు 54 లక్షలు, 2011 జనాభా లెక్క ల ఆధారంగా).

ఎస్టీ జనాభా: 9.34 శాతం (సుమారు 32.7లక్షలు, 2011 జనాభా లెక్కల ఆధారంగా). ఈ డేటా బీసీలు జనాభాలో సగానికి పైగా ఉన్నప్పటికీ, విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వారి ప్రాతినిధ్యం తక్కువగా ఉందని సూచిస్తుంది. అయితే, కులగణన డేటా బహిర్గతం కాకపోవడం వల్ల, అత్యంత వెనుకబడిన కులా ల సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులను గుర్తించడం కష్టతరమవుతుంది.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలైతే, తెలంగాణలో అన్ని రిజర్వేషన్లు కలిపి 66.79 శాతానికి (ఎస్సీలకు 15.45 శాతం, ఎస్టీల కు 9.34శాతం రిజర్వేషన్లు కలిపి) చేరుకుంటాయి. తద్వారా రిజర్వేషన్లు 50శాతం సీలింగ్‌ను మించుతాయి. అయితే.. కులగణన డేటా బహిర్గతం కాకపోవడం కార ణంగా 42శాతం రిజర్వేషన్ల కల్పనకు చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే ప్రమా దం ఉంది. 

రాజకీయ హామీలు, ఆందోళనలు.. 

తాము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, విద్య, ఉద్యోగ రంగాల్లోనూ దమా షా ప్రకారం రిజర్వేషన్లను కల్పిస్తామని 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ డిక్లరేషన్  నే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని పేర్కొంటున్నది. రాష్ట్రప్రభుత్వం 1,03,889 ఎన్యూమరేటర్లతో కులగణన ప్రక్రియ పూర్తి చేసినప్పటికీ, ఆ డేటా బహిర్గతం కాకపోవడంతో విద్య, ఉద్యోగ రంగా ల్లో రిజర్వేషన్ల అమలు ఆలస్యమతున్నది.

ఇది వెనుకబడిన వర్గాలకు నిరాశ కలిగిస్తోంది. ప్రస్తుతం మెడికల్, ఇంజినీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రభుత్వం లక్ష ఉద్యోగాల కల్పనకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో 20 26 నాటికి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కాకపోతే, బీసీ అభ్యర్థులు, విద్యార్థులు నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. 

తమిళనాడు మాడల్ ఉదాహరణ..

తమిళనాడులో ప్రస్తుతం 69 శాతం రిజర్వేషన్‌న్లు (ఎస్సీలకు 18 శాతం, ఎస్టీల కు 1శాతం బీసీలకు 50శాతం) అమలవుతున్నాయి. గణాంకాల పరంగా చూస్తే ఆ రాష్ట్రంలో 50శాతం సీలింగ్ దాటింది. అయినా, అక్కడ రిజర్వేషన్లు 50శాతానికి పైగా ఎలా అమలవుతున్నాయంటే అందు కు రెండు బలమైన కారణాలున్నాయి. ఒకటి అంబ శంకర్ కమిషన్ 1980 సిఫార్సులతో అప్పటి సీఎం ఎంజీ రామచం ద్రన్ బీసీ రిజర్వేషన్లను 31శాతం నుంచి 50శాతానికి పెంచారు.

అగ్రకులాల నిరసనలు కొనసాగాయి.  ఆ వర్గాల నుంచి వ్యతిరేకత వచ్చింది. చివరకు అంబ శంకర్ కమిషన్ సుప్రీంకోర్టులో శాస్త్రీయమైన డేటా సమర్పించడంతో, న్యాయస్థానం ఆ రిజర్వేషన్లను సమర్థించింది. రెండు 1994 లో నాటి సీఎం జయలలిత చొరవతో తమిళనాడు రిజర్వేషన్ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చారు. దీని వల్ల సుప్రీం కోర్టు సమీక్ష నుంచి రక్షణ లభించింది.

42% కోటా అమలు కావాలంటే..

రాష్ట్రప్రభుత్వం వెంటనే కులగణన డేటాను బహిర్గతం చేయాలి. వెనుకబడిన కులాల స్థితిగతులను శాస్త్రీయంగా నిర్ధారించాలి. అంబశంకర్ కమిషన్ తరహాలో రిజర్వేషన్‌ను సమర్థించే నివేదికను సిద్ధం చేయాలి. రిజర్వేషన్ చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చాలి. తద్వారా చట్టపరమైన రక్షణ సాధించాలి.

అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రధాన పార్టీలు బీఆర్‌ఎస్, బీజేపీతో సహా అన్ని పార్టీల మద్దతును సమీక రించాలి. రిజర్వేషన్లపై ఏకాభిప్రాయం తీసు కురావాలి. బీజేపీ ప్రజాప్రతినిధులు, నేతలు ఈమేరకు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి, రిజర్వేషన్ చట్టాన్ని 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు కృషి చేయాలి.