02-09-2025 12:41:13 AM
గచ్చిబౌలి, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): చందానగర్ పోలీసులు బాలల కిడ్నాప్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసి, ఆరుగురు చిన్నారులను రక్షించారు. లింగంపల్లి పొచమ్మగుడి సమీపంలో నాలుగేళ్ల అఖిల్ అదృశ్యమైన కేసు దర్యాప్తులో ఈ గ్యాంగ్ బట్టబయలైంది. ప్రధాన నిందితుడు పటాన్‌చేరు వాసి చిలుకూరి రాజు గత ఐదు సంవత్సరాలుగా హైద రాబాద్, సైబరాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో రైల్వే స్టేషన్లు, ఒంటరి ప్రదేశాల్లో ఐదు సంవత్సరాల లోపు వయసున్న పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్నట్టు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు.
రాజు రెక్కీ చేసి పిల్లలను కిడ్నాప్ చేయగా, అతడి సహచరులు మొహమ్మద్ ఆసిఫ్, రిజ్వానా సహాయంతో పిల్లలు లేని తల్లిదండ్రులకు అమ్మేవాడు. సిద్దిపేటకు చెందిన రిజ్వానా నర్సింగ్ క్లినిక్ నిర్వహిస్తూ ఈ వ్యవహారాన్ని కొనసాగించేది. మూసాపేటకు చెందిన నర్సింహరెడ్డి, పటాన్చెరువుకు చెందిన బాలరాజు కూడా ఈ ముఠాకు సహకరించేవారు.
ఇప్పటివరకు ఈ ముఠా నలుగురు పిల్లలను విక్రయించినట్టు, ఇటీవల లింగంపల్లి ప్రాంతం నుంచి అఖిల్‌ను కిడ్నాప్ చేసినట్టు తేలింది. మొత్తం ఆరుగురు చిన్నారులు అఖిల్ (5), అరుణ్ (2), అమ్ములు (8 నెలలు), లాస్య (5) తల్లిదండ్రులను ఇంకా గుర్తించలేదని, అద్విక్ (2), ప్రియా (1) లను తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. కాపాడిన పిల్లలను జిల్లా బాలల సంరక్షణ అధికారులకు అప్పగించారు.