02-07-2025 12:00:00 AM
పదేళ్ల క్రితం రూపొందించిన తెలంగాణా ఆరో తరగతి తెలుగు పుస్తకం ముందుమాటలో తెలంగాణ సాహిత్యం, సంస్కృతిని ప్రతిబింబించేటట్లు పాఠ్యపుస్తకం ఉంటుంది అని రాసి ఉన్నది. భాషా సామర్థ్యాలు, సృజనాత్మకత, మానవీయ విలువలు పెంపొందించేందుకు వీలుగా వాచకాల రూపకల్పన జరిగినట్లు ఉంది.
ఆ మాటల్లో చాలా వరకు వాస్తవాలు ఉన్నాయి. కానీ పాఠ్యపుస్తకాలు ఆయా లక్ష్యాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ విద్యార్థుల భాషా సామర్థ్యాలకు మించి ఉన్నాయని ఈ పదేళ్లు భోదించిన ప్రతి ఒక్కరూ తమ అనుభవంతో చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పాఠ్యాంశాల మీద సమగ్ర చర్చ జరగాలి.
ముఖ్యంగా ఇప్పుడున్న సాంకేతిక యుగంలో ఆంగ్లభాషా ప్రవాహంలో కొట్టుకుపోతున్న విద్యార్థులకు సరళమైన శైలిలో పాఠ్యాం శాలు రూపొందిస్తేనే, అవి వారి భాషా సామర్థ్యాలకు బలం చేకూరుస్తాయి. ఇక ఆరోతరగతి పాఠ్యాంశాల విషయానికి వస్తే.. పాఠ్య పుస్తకంలో 12 పాఠాలతో పాటు 5 ఉపవాచక పాఠాలు ఉన్నాయి. అలాగే సాహిత్యపరమైన 12 ప్రక్రియల పరిచయం కూడా ఉంది.
ఏ ప్రక్రియ అయినా పిల్లల భాషా సామర్థ్యాల పెంపునకు దోహదం చేయాలి. కానీ, పాఠ్యాంశాలు పిల్లలకు అర్థమయ్యే రీతిలో లేవు. కనీసం విద్యార్థులు చదవడానికే కూడా పాఠాలు కష్టంగా ఉన్నాయి. ‘వర్షం.. పాఠం’ అనే ఖండకావ్య పాఠ్యాంశంలో పదాలు కఠినంగా ఉన్నాయి. వర్షం గురించే పాఠం పెట్టాలనుకుంటే రచయితలు సులభశైలిలో ఉండే ఇతర కవుల కవితలు పెడితే బాగుండేది.
అలాగే ‘శతక సుధ’ పాఠ్యాంశంలో ఎనిమిది శతక పద్యాలున్నాయి. శ్రీకాళ హస్తీశ్వర వంటి పద్యాలు అరో తరగతికి అవసవరమా? అయిదో ఆరో వేమన/ సుమతీ శతకాలు ఉంటే, పిల్లలు వాటిని కంఠస్థం చేస్తారు. వివరణ లేకుండానే పద్యాలను అవగాహన చేసుకుంటారు.
చిన్నయసూరి’ స్నేహబంధం కథను సరళంగా మార్చినట్లు ‘ఉడుతసాయం’ పాఠాన్ని కూడా కథ గానో/ గేయంగానో మార్చితే ఎంత బాగుంటుంది. మిగతా పాఠాలు స్థాయికి తగ్గవే ఉన్నాయి. బాల్య దశలో ఉన్న పిల్లలకు వారి స్థాయిని బట్టి, వారి ఆలోచనా పరిమితిని బట్టే పాఠాలు ఉండాలి.
కానీ, ఈ పాఠ్యపుస్తకంలో పాఠాలు అలా లేవు. నిజం చెప్పాలం టే పాఠాలు బోధించే ఉపాధ్యాయులకే పాఠాలు అర్థం చేసుకునేందుకు కష్టతరం అనిపించేలా ఉన్నాయి. చివరగా.. పాఠ్యాంశాల సంఖ్యను ఉప వాచకంతో కలిపి 12 పాఠాలకు పరమితం చేసి భాష పట్ల విద్యార్థులకు అసక్తి కలిగించాలి.
తెలుగు పాఠ్యపుస్తకాలు తెలుగు భాషా సామర్థ్యాల సాధనకు మెట్లుగా ఉపయోగపడాలి అన్నది నిర్వివాదాంశం. దానికి అనుగుణంగా ఆరోతరగతి తెలుగు పుస్తకం మారితే మేలు. ఈ మేరకు ప్రభుత్వం, రాష్ర్ట విద్యాపరిశోధనా సంస్థ, పాఠ్యపుస్తకాల రూపకల్పనలో పాల్గొనే వారు అలోచించి తగు మార్పులు చేయాలని ఉపాధ్యాయులు ఆకాంక్షిస్తున్నారు.
వెన్నెల సత్యం
వ్యాసకర్త సెల్: 94400 32210