01-07-2025 12:00:00 AM
స్వతంత్ర దేశంగా తన సొంత సమస్యల భారంతో భారత్ కుప్ప కూలి పోతుందని, ప్రపంచం ముందు భిక్షాపాత్రను పట్టుకోవాల్సి వస్తుందని అనేకమంది వలసవాదులు భావించిన రోజులు మనకు తెలుసు. అనేకమంది పాశ్చాత్య పరిశీలకుల దృష్టిలో, తక్కువ సమయంలో అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అవసరమైనవేవీ లేని దేశం కూడా మనదే. ఈ భావనకు వ్యతిరేకంగా నేడు, భారతదేశం 2047 నాటికి పూర్తిగా అభివృద్ధి చెందడం అనే ఒక మైలురాయి లక్ష్యాన్ని నిర్దేశించుకొంది.
ఆ దిశగా ఆర్థికాభివృద్ధి మార్గంలో కొనసాగుతోంది. కొందరి దృష్టిలో ఇదంత తేలిక కాదన్న అభిప్రాయమూ ఉంది. మరోవైపు ప్రపంచం నిరంతర ఆర్థిక అనిశ్చితులను ఎదుర్కొంటున్నా భారత్ మాత్రం ఆశ్చర్యకరంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రకాశవంతంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నది. దీనికి ఉదాహరణగా తాజాగా దేశంలో గత కొన్నేళ్లుగా తగ్గుతున్న ప్రజల పేదరికపు స్థితిగతులనే పేర్కొనాలి.
గణనీయంగా తగ్గుముఖం
ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక ప్రకా రం గడచిన పదేళ్లలో భారతదేశంలో పేదరిక స్థాయి తగ్గుముఖం పట్టింది. ద్రవ్యో ల్బణం, కొనుగోలు శక్తి సమానత్వాన్ని ప్రతిబింబించేలా దారిద్య్రరేఖను రోజుకు 3 డాలర్లకు పెంచిన తర్వాత కూడా, గత 10 సంవత్సరాలలో భారత్ ఆశ్చర్యకరంగా 17.1 కోట్ల మందిని తీవ్ర పేదరికం నుంచి బయటకు తీసుకురావడంలో విజయం సాధించినట్టు గణాంకాలు చెబుతున్నా యి.
ఇది రష్యా మొత్తం జనాభాకంటే ఎక్కువ. 2011--12 నాటికి భారతదేశ జనాభాలో 27 శాతానికి పైగా ప్రజలు తీవ్ర పేదరికంలో మగ్గుతున్నారు. నేడు ఆ సం ఖ్య కేవలం 5.3 శాతానికి తగ్గిపోయినట్లు నిపుణులు చెబుతున్నారు. కోట్లాదిమంది సాధారణ భారతీయులకు అద్భుత మలుపుగానూ దీనిని వారు అభివర్ణిస్తున్నారు.
అయితే, గణాంకాలు నిజమే చెప్తాయా? ప్రభుత్వ గణాంకాల ఆధారంగా రూపొందిన అంచనాలు వాస్తవిక పరిస్థితిని ప్రతి బింబిస్తాయా? వంటి సందేహాలు ఉన్నప్పటికీ ప్రజల స్థితిగతులలో కొంత మార్పు వస్తున్న మాట మాత్రమైతే కాదనలేని నిజం. పై గణాంకాల ప్రకారం గ్రామీణ తీవ్ర పేదరికం 18.4 శాతం నుంచి 2.8 శా తానికి నాటకీయంగా తగ్గింది.
పట్టణ తీవ్ర పేదరికం 10.7 శాతం నుంచి కేవలం 1.1 శాతానికి తగ్గింది. ముఖ్యంగా, గ్రామీణ--పట్టణ పేదరిక అంతరం 7.7శాతం పా యింట్ల నుంచి 1.7 పాయింట్లకు తగ్గింది. ఇది అభివృద్ధి ఫలాలు కొన్ని పట్టణ కేం ద్రాలకు అందడం లేదని, కానీ, లోతట్టు ప్రాంతాలకు మాత్రం చేరుతున్నాయని సూచిస్తున్నది. దేశంలోని సమ్మిళిత, సమతుల్య, సామాజికంగా సమాన వృద్ధికి సంకేతంగానూ దీనిని కొందరు అభివర్ణిస్తున్నారు.
ప్రయోజనకరంగా ప్రత్యక్ష బదిలీలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని విధానం స్పష్టంగా ఉంది. ప్రజలు తమ కాళ్ళపై తాము నిలబడటానికి శక్తి నివ్వడం, అవసరమైనంత కాలం వారికి మద్దతు ఇవ్వడానికి బలమైన భద్ర తా వలయాన్ని అందించడం. ఇది పేదరికం నుంచి స్థిరమైన, శాశ్వత నిష్క్ర మణను నిర్ధారిస్తుంది. సాధికారతతో కూడిన ఈ శక్తివంతమైన సంక్షేమ నమూ నా దేశంలో సరికొత్త ప్రమాణాన్ని నిర్దేశించింది.
80 కోట్లమందికి మద్దతు ఇచ్చే ప్రభుత్వ ఉచిత ఆహార ధాన్యాల కార్యక్ర మం, ముఖ్యంగా మహమ్మారి సమయం లో ఆర్థిక సంక్లిష్టతలకు వ్యతిరేకంగా కీలకమైన భద్రతా వలయంగా పనిచేసింది. ప్రపంచ స్థాయిలోనే ఇంతకు ముందు లేని రీతిలో ప్రాథమిక ఆహార భద్రతను ఈ పథకం నిర్ధారిస్తున్నది.
ప్రత్యక్ష ప్రయోజన బదిలీలు (డీబీటీ: డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్స్) వంటి సాంకేతిక పరిజ్ఞానం తాలూకు ఉపయోగం ఈ ప్రయోజనాలు ఉద్దేశించిన గ్రహీతలకు నేరుగా చేరేలా చూడటంలో కీలకమైందిగా చెప్పాలి. చారిత్రాత్మకంగా సంక్షేమ పథకాల తాలూకు సమస్యలను అరికట్టడంలో ఇది కీలక పాత్ర పోషిస్తున్నది.
పాకిస్థాన్ పరిస్థితి విరుద్ధం
పేదరికం విషయంలో భారతదేశం గణనీయమైన పురోగతి సాధించినప్పటికీ, పాకిస్థాన్‌లో పరిస్థితి పూర్తి విరుద్ధంగా ఉంది. ప్రపంచ బ్యాంకు తాజా అంచనాల ప్రకారం, పాకిస్థాన్ జనాభాలో దాదాపు 45 శాతం మంది ఇంకా పేదరికంలోనే ఉన్నారు. 16.5 శాతం మంది తీవ్ర పేదరికంలో ఉన్నారు. అధిక ద్రవ్యోల్బణం, అప్పుల కారణంగా దేశం 2.6 శాతం ఆర్థిక వృద్ధి పేదరికాన్ని తగ్గించడానికి సరిపోదని బ్యాంక్ ఏప్రిల్ నివేదిక పేర్కొంది.
ఇది ఆర్థి క సంవత్సరం 2025లో పేదరిక రేటు 42.4 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. అంటే, ఈ సంవత్సరం మాత్రమే అదనంగా 19 లక్షల మంది పేదరికంలోకి పడిపోతారు. ఒకే చరిత్ర నుంచి పుట్టిన రెం డు (భారత్, పాకిస్థాన్) దేశాల విభిన్న మార్గాలలో ఏది మెరుగైందో దీనినిబట్టి మనకు అర్థమవుతున్నది. ఆశ్చర్యకరంగా, భారతదేశంలోనే కొందరు పై గణాంకాలను సందేహిస్తున్నారు.
నిజంగా పేదరికం తగ్గుముఖం పట్టిందా? అన్న ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. గణాంకాలు అబద్ధం చెప్తాయా? అందులో ప్రపంచంలోనే ప్రామాణిక సంస్థ అయిన వరల్డ్ బ్యాంక్ వెల్లడించిన విషయాలపట్ల విశ్వాసాన్ని ప్రకటింకపోతే ఇక మనం ఏ రకమైన లెక్కలను పట్టించుకోగలం! ముఖ్యంగా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చెందించడం అన్నది దేశ పేరు ప్రతిష్ఠలకు తీవ్ర భంగకరమని నిపుణులు అంటున్నా రు.
ఈ రకమైన అసత్య ప్రచారం నిజమైన పురోగతిని కప్పి వేస్తుంది. విమర్శనాత్మక ఆలోచన, వాస్తవాల నిష్పాక్షిక అంచనా అవసరం. ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థ డేటాను విశ్లేషించి, పెద్ద ఎత్తున పేదరిక తగ్గింపునకు స్పష్టమైన ఆధారాలను చూడగలిగితే, అది ఖచ్చితం గా భారతీయులకు పరిగణించదగిన సమాచారంగా నిలుస్తుంది.
విజయవంతమవుతున్న ఆర్థిక ప్రేరణ
గౌరవప్రదమైన జీవితంలోని ప్రతి అం శాన్ని తాకుతూ అభివృద్ధి, సంక్షేమం కో సం దేశవ్యాప్త కృషి సమగ్రంగా ఉన్నట్టు విశ్లేషకులు ఈ సందర్భంగా అభిప్రాయ పడుతున్నారు. ‘స్వచ్ఛ భారత్’ మిషన్ ద్వారా మరుగుదొడ్లను నిర్మించడం, కొత్త రోడ్లు, రైల్వేల బలమైన నెట్‌వర్క్‌తో కనెక్టివిటీని మెరుగు పరచడం, ఉజ్వల యోజన తో శుభ్రమైన వంటగ్యాస్ యాక్సెస్‌ను విస్తరింపజేయడం వంటివన్నీ ఇందులో ఉన్నాయి.
ఇది ‘పీఎం ఆవాస్- పథకం’ ద్వారా లక్షలాది మందికి ఇళ్లను అందించడం, ప్రతి గ్రామానికి విద్యుత్తు చేరేలా చూడటం, ఆయుష్మాన్ భారత్‌తో ఆరోగ్య సంరక్షణ భద్రతా వలయాన్ని ఏర్పరచడం, ముద్ర యోజన ద్వారా చిన్న తరహా వ్యవస్థాపకతను ప్రోత్సహించడం వంటివన్నీ ఈ తరుణంలో పరిశీలించదగ్గ కార్యక్రమా లు.
భారతదేశ ప్రగతి ఇవాళ తన ప్రజల ను ఆధారపడే స్థితినుంచి గౌరవప్రదంగా జీవించే స్థాయికి చేర్చడానికి కావలసిన సహాయమంతా అందిస్తోంది. దీనిని సామాజిక విజయంగానేకాక ఆర్థిక పురోభివృద్ధిగానూ పేర్కొనవచ్చు. ఒక లోతైన ఆర్థిక ఉత్ప్రేరకంగానూ దీనిని పరిగణించాలని విశ్లేషకులు అంటున్నారు.
17.1 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకురావడం అంటే అంతటి సంఖ్యలో కొత్త వినియోగదారులను, సంభావ్య ఉత్పత్తిదారులను సృష్టించడంగానే చూడాలి. కుటుంబాలు జీవనాధారానికి మించి కదులుతున్నప్పుడు, వారు ఆర్థిక వ్యవస్థలో పూర్తిగా పాల్గొనడం ప్రారంభిస్తారు.
ఉదా॥కు వారు సబ్బు, బట్టలు, మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే స్థితికి చేరుకుంటారు. తమ పిల్లల విద్యకోసం ఆదా య వనరులను పొదుపు చేస్తారు. లేదా ఓ ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలని అనుకుంటారు. దేశీయ డిమాండ్‌లో ఈ రకమైన సామాజిక పెరుగుదల ఉత్పత్తి, వినియోగాల సద్గుణ చక్రాన్ని కొత్త శక్తితో ముందు కు నడిపిస్తుంది.
భారత తయారీ రంగంపై కొత్త దృష్టి కేంద్రీకృతమైన ప్రస్తుత కీలక సమయంలో ఇది జరగడం ప్రశంసనీయమని కూడా విశ్లేషకులు అంటున్నారు. మేక్ ఇన్ ఇండి యా, ప్రొడక్షన్- లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) వంటి కార్యక్రమాలు దేశాన్ని ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చడానికి ఉద్దేశితమైనాయి.
కానీ, అలాంటి ఏదైనా ఆశయా నికి విస్తారమైన, సమర్థవంతమైన, ఆకాంక్షాత్మక శ్రామిక శక్తి అవసరం. ఇటీవల పేదరికం నుంచి బయటపడిన లక్షలాది మందిలో ఆ శ్రామిక శక్తి -ఫ్యాక్టరీ కార్మికు లు, లాజిస్టిక్స్ హ్యాండ్లర్లు, రేపటి చిన్న-వ్యాపార యజమానులు వంటి వారెంద రో ఉంటారు. మెరుగైన ఆరోగ్యం, విద్యకు ప్రాప్యత వారికి మరింత ఉత్పాదకతా శక్తిని అందిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
గడీల ఛత్రపతి