calender_icon.png 8 July, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

8 గంటల పని హక్కుని మార్చడం దుర్మార్గం

07-07-2025 11:44:51 PM

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు..

హైదరాబాద్ (విజయక్రాంతి): వాణిజ్య ప్రదేశాలలో ఉద్యోగులు, కార్మికులకు ఉన్న 8 గంటల పని హక్కుని మార్చడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు(CPI State Secretary Kunamneni Sambasiva Rao) సోమవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకు పది గంటల పాటు పని చేయించుకునేందుకు యాజమాన్యానికి వీలు కల్పిస్తూ జారీ చేసిన జీవో 282ను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇది కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులకు భంగకరమని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను ఇలాంటి జీవోల అమలు చేయడం మంచిది కాదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఒకవైపు దేశవ్యాప్తంగా జూలై 9న నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలని సార్వత్రిక సమ్మెకు సిద్ధమైన తరుణంలో ఇలాంటి జీవో జారీ చేయడం ఎంత మాత్రం సమంజసం కాదని సూచించారు.

కార్మికులు 10 గంటలు పని చేసే సమయంలో ఓవర్ టైమ్ ఇవ్వాలని, ఆరు గంటలకు ఒకసారి అరగంట విశ్రాంతి ఇవ్వాలని, వారానికి 48 పని గంటలు మించొద్దని జీవోలో ఉన్నప్పటికీ అది ఆచరణ సాధ్యం కాదని స్పష్టం చేశారు. కార్మిక శాఖ అధికారులు పట్టించుకోని ఉదంతం సిగాచి దుర్ఘటన రూపంలో కళ్ళ ముందటే ఉందని పేర్కొన్నారు. పది గంటల పని విధానం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కల్పించిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. నాలుగు లేబర్ కోడ్, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జూలై 9న పది కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన జాతీయ సార్వత్రిక సమ్మెకు సీపీఐ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కూనంనేని సాంబశివరావు తెలిపారు. సమ్మెకు మద్దతుగా రాష్ట్ర  వ్యాప్తంగా సీపీఐ శ్రేణులు కార్మిక సంఘాలకు సంఘీభావంగా నిలవాలని కోరారు.