24-11-2025 12:00:00 AM
కామారెడ్డి, నవంబర్ 23 (విజయక్రాంతి): నరస శతకం పుస్తకాల్లో సామాజిక సమస్యల పరిష్కారం కోసం రాసిన పద్యాలు ఆలోచింప చేశాయని, డాక్టర్ లచ్చయ్య అన్నారు. ఆదివారం కామారెడ్డిలో తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో అక్షర శిల్పాలు నరసా శతకం పుస్తకాల ఆవిష్కరణ చేపట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ లచ్చయ్య మాట్లాడుతూ.. వివేచనాత్మకమైన విధానం ఈ పద్యాల్లో కనిపిస్తున్నదని సమాజంలో పేరుకుపోతున్న మూఢనమ్మకాలను, మత విశ్వాసాలను పారద్రోలే విధంగా శాస్త్రీయమైన దృక్పథంతో మానవీయ కోణంలో ఈ పుస్తకాల్లోని పద్యాలు ఉన్నాయని అన్నారు.
తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో కామారెడ్డి లోని రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో ప్రముఖ పద్య కవి కాశ నరసయ్య రాసిన అక్షర శిల్పాలు నరస శతకం పుస్తకాలను ఆవిష్కరించారు. అక్షర శిల్పాలు పుస్తకాన్ని ప్రముఖ గజల్ కవి సూరారం శంకర్ ఆవిష్కరించగ నరస శతకం పుస్తకాన్ని ఎనిశెట్టి గంగా ప్రసాద్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పుస్తకాల్లో శాస్త్రీయమైన ఆలోచనలు ఎక్కువగా ఉన్నాయని సామాజిక అనుబంధాలు ప్రేమతత్వం నైతిక విలువలు ఈ పుస్తక పద్యాలలో చోటు చేసుకున్నాయని అన్నారు. నేటి కాలంలో ప్రేమలు తగ్గిపోయి స్వార్థభావం పెరిగి సత్యం కనిపించకుండా పోతున్నదని కవులు ఆవేదన చెందారు. నైతిక విలువలను పెంపొందించే విధంగా ఈ పుస్తకాలు ఉన్నాయని తెరవే జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ అభిప్రాయపడ్డారు.
గోపు నందిని ఏ రంగాచారి పుస్తకాలను సమీక్షించారు. సామాన్యుల ఆలోచనలకు అక్షర రూప నిర్మాణం చేసిందే అక్షర శిల్పాలు పుస్తకమని నరస శతకంలో సగటు మనిషి బాధలు సమస్యలను ప్రస్తావించారని అన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం కామారెడ్డి యూనిట్ అధ్యక్షులు అర్జున్ రావు, కార్యదర్శి మహమూద్ అలీ,
విశిష్ట అతిథులుగా గజల్ కవి సూరారం శంకర్, ఎని శెట్టి గంగా ప్రసాద్, వి హనుమంత రెడ్డి, ఈశ్వర్ గౌడ్, తెరవే బాధ్యులు నాగభూషణం, కాసర్ల రామచంద్రం, శేషారావు, నవీన్ రెడ్డి, ఎంబారి లింగం రిటైర్డ్ ఉద్యోగులు దయాకర్ రావు, సలాం ఖాన్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం పుస్తక కర్త కాశ నరసయ్యను కవులందరూ కలిసి సన్మానించారు.