calender_icon.png 30 August, 2025 | 4:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్ కష్టాలకు చెక్

30-08-2025 02:13:57 AM

-రేతిబౌలి, నానల్ నగర్ జంక్షన్లకు మహర్దశ

-రూ.398 కోట్లతో పనులకు జీహెఎంసీ టెండర్లు 

-మొదలైన బిడ్ల స్వీకరణ 

హైదరాబాద్ సిటిబ్యూరో, ఆగస్టు 29 (విజయక్రాంతి): నగరంలో అత్యంత రద్దీగా ఉండే రేతిబౌలి, నానల్ నగర్ జంక్షన్ల మీదుగా ప్రయాణించే లక్షలాది వాహనదారులకు జీహెఎంసీ శుభవార్త చెప్పింది. ఏళ్లుగా నరకంగా మారిన ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెడుతూ, ఈ మార్గంలో సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందించేందుకు ఎస్సార్డీపీ కింద భారీ మల్టీలేవల్ ఫ్లుఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రూ.398 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పనులకు శుక్రవారం టెండర్లను ఆహ్వానించింది.

గంటల తరబడి ట్రాఫిక్ నరకం..

ముంబై, కర్ణాటక రాష్ట్రాలతో పాటు వికారాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి, గచ్చిబౌలి వంటి కీలక ప్రాంతాలకు వెళ్లేందుకు రేతిబౌలి, నానల్ నగర్ మార్గం అత్యంత కీలకం. ప్రతిరోజూ లక్షలాది వాహనాలు ఈ మార్గంలో ప్రయాణిస్తుండటంతో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు జీహెఎంసీ పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేకు సమాంతరంగా ఈ ఫ్లుఓవర్ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. సెప్టెంబర్ 1 నుంచి 22 వరకు బిడ్లను స్వీకరించనుండగా, 8న ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించనున్నారు.

ఫ్లుఓవర్ నిర్మాణం ఇలా..

మెహిదీపట్నంలోని ఆర్మీ స్థలంలో ఉన్న జలమండలి ఫిల్టర్‌బెడ్ నుంచి పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేకు సమాంతరంగా ఈ ఫ్లుఓవర్ ప్రారంభమవుతుంది. రేతిబౌలి జంక్షన్ వద్ద అత్తాపూర్ వైపు వెళ్లేందుకు ఒక ర్యాంప్‌ను ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి నానల్ నగర్ జంక్షన్ మీదుగా ఈ ఫ్లుఓవర్ నేరుగా టోలీచౌకి ఫ్లుఓవర్‌కు అనుసంధానం అవుతుంది. అదేవిధంగా, నానల్ నగర్ జంక్షన్ నుంచి లంగర్‌హౌస్ వైపు వెళ్లే వాహనాల కోసం ఆలివ్ ఆస్పత్రి వరకు మరో ర్యాంప్ ను నిర్మిస్తారు. మొత్తం మీద రెండు లేన్లతో రాకపోకల కు వీలుగా ఈ నిర్మాణం ఉంటుం ది. ఈ ప్రాజెక్టు కోసం మెహిదీపట్నంలోని రక్షణ శాఖ స్థల సేకరణకు అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.రోడ్ నెం.12 నుంచి మరో అనుసంధానంమరోవైపు బం జారాహిల్స్ నుంచి ఎయిర్‌పోర్టు, ముంబై జాతీయ రహదారి వైపు వెళ్లే వాహనాల ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు జీహెచ్ ఎంసీ మరో కీలక ప్రతిపాదనను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఈ వాహనాలు రోడ్ నెం.12, మాసబ్ ట్యాంక్, ఎన్‌ఎండీసీ, మెహిదీపట్నం మీదుగా ప్రయాణిస్తూ తీవ్ర ట్రాఫిక్ సమస్యను ఎదుర్కొంటు న్నాయి. దీనికి పరిష్కారంగా బంజారాహిల్స్ రోడ్ నెం.12 నుంచి హోటల్ నషేమన్, పోచమ్మబస్తీ, హుమాయున్‌నగర్ మీదుగా ఫిల్టర్‌బెడ్ వద్ద నిర్మించనున్న ప్రధాన ఫ్లుఓవర్‌కు అనుసంధానంగా మరో ఫ్లుఓవర్‌ను నిర్మించనున్నారు. ఈ ప్రతిపాదనలు ప్రస్తు తం స్థల సేకరణ దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే మెహిదీపట్నం కారిడార్‌లో ట్రాఫిక్ కష్టాలు పూర్తిగా తీరిపోనున్నాయి.