30-08-2025 02:15:51 AM
-ఆక్రమణదారుడి పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీం కోర్టు
-హైడ్రా చర్యలను సమర్థించిన సర్వోన్నత న్యాయస్థానం
హైదరాబాద్ సిటిబ్యూరో, ఆగస్టు 29 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ హౌస్ బిల్డింగ్ కో-ఆపరేటివ్ సొసైటీకి చెందిన రూ.కోట్ల విలువైన రెండు వేల చదరపు గజాల భూమిపై సాగిన సుదీర్ఘ న్యాయపోరాటం ఫలించింది. ఈ భూమిపై అక్రమంగా వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేయడంతో సొసైటీ హక్కులు పదిలమయ్యా యి. ఈ వివరాలను సొసైటీ అధ్యక్షుడు బొల్లినేని రవీంద్రనాథ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సొసైటీకి చెందిన విలువై న భూమిని పి. సత్యనారాయణ అనే వ్యక్తి ఆక్రమించడంతో, సొసైటీ యాజమాన్యం హైడ్రాకి ఫిర్యాదు చేసింది.
దీనిపై సమగ్ర విచారణ జరిపిన హైడ్రా, ఆక్రమణదారుడికి షోకాజ్ నోటీసు జారీ చేసి, అనంతరం స్పీకింగ్ ఆర్డర్ ద్వారా అనధికార నిర్మాణాలను తొలగించింది.హైడ్రా చర్యలను సవా లు చేస్తూ సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించాడు. హైడ్రా నిబంధనల ప్రకారమే విచారణ జరిపిందని నిర్ధారించిన న్యాయస్థానం, రిట్ పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది. దీంతో సత్యనారాయణ నేరుగా సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ కేసులో సొసైటీ తరఫున సీనియర్ న్యాయవాది దామ శేషాద్రి నాయుడు, అడ్వొకేట్ ఈ. వెంకట సిద్దార్థ తమ వాదనలను బలంగా వినిపించారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు, అడ్మిషన్ దశలోనే కొట్టివేసింది. దీంతో హైడ్రా చర్యలకు, సొసైటీ హక్కులకు న్యాయబద్ధత లభించింది. ఈ విజయం సొసైటీ ఆస్తులను కాపాడటంలో ఒక చారిత్రక మైలురాయి అని అధ్యక్షుడు బొల్లినేని రవీంద్రనాథ్ అన్నారు. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ప్రభుత్వానికి, హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు, జీహెఎంసీ అధికారులకు, న్యాయవాదులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం కోసం పనిచేసిన గవర్నింగ్ బాడీ సభ్యులను అభినందించారు.