24-09-2025 12:51:40 AM
-స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఖరారు
-బీసీలకు 42% రిజర్వేషన్లు
-మెజార్టీగా మార్పులు, చేర్పులు
-రిజర్వేషన్లపై సర్వత్రా ఆసక్తి
-అక్టోబర్ లోనే ఎన్నికలు పూర్తిచేసేలా..
-ఇప్పటికే సిద్ధం చేసిన అధికారులు
-వ్యూహరచనలో రాజకీయ పార్టీలు
-జిల్లాలో స్థానిక సంస్థలు
మొత్తం పంచాయతీలు : 526
వార్డులు : 4,668
ఎంపీటీసీలు : 230
జెడ్పీటీసీలు : 21
మొత్తం ఓట్లు : 7,94,653
పురుషులు : 3,99,404
మహిళలు : 3,95,216
రంగారెడ్డి, సెప్టెంబర్ 23( విజయక్రాంతి): స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఈ నెలాఖరులోపు హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం అఫిడ విట్ దాఖలు చేయాల్సిన గడువు సమీపిస్తుండటంతో ప్రభుత్వం ఎన్నికల కసరత్తును మొదలెట్టింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఎన్నికల నిర్వహణలో భాగంగా జెడ్పిటిసి( జడ్పీ చైర్మన్) ఎంపీటీసీ( ఎంపీపీ) సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్లకు అంతర్గత ఆదేశాలు జారీ చేశారు.
బీసీలకు కుల గణన సర్వే ద్వారా నలభై రెండు శాతం, ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రిజర్వేషన్లు 2018 లో కేటాయించిన లెక్కల ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని పలు డైరెక్షన్ల ఆయన సూచించారు. దీంతో జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం జిల్లా జడ్పీ సీఈవో, పంచాయతీ అధికారి, ఎంపీడీఓలు జిల్లా, మండలం, గ్రామాల వారి గా రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసినట్లు విశ్వసనీయ సమాచారం. రిజర్వేషన్లకు సంబంధించింది పూర్తి వివరాలను ఎక్కడ బయటకు ఒక్క కుండ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సీరియస్గా జిల్లా కలెక్టర్ అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్ల అంశంపై సంబంధిత అధికారులు దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నారు.
2011 జనాభా లెక్కల ప్రకారం
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు మెజార్టీగా మార్పులు చేర్పులు కానున్నాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు, 2024 కులగణన ఆధారంగా బీసీలకు రిజర్వేషన్లను కల్పించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా మండలాల వారిగా కులాల జనాభా లెక్కల పై అధికారులు దృష్టి సారించి వివరాలను సేకరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో కేటాయించిన రిజర్వేషన్లను 2006, 2013, 2019ను సైతం పరిగణలోకి తీసుకొని రొటేషన్ సిస్టంలో కొత్త రిజర్వేషన్లు జాబితాలను రూపొందిస్తున్నారు. ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% సీట్లు కేటాయించేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ లెక్కలను పరిగణలోకి తీసుకొని రిజర్వేషన్లు మార్పులు చేర్పులు చేయనున్నారు.
టిఆర్‌ఎస్ ప్రభుత్వం గతంలో రిజర్వేషన్లను పదేళ్లుగా అమలు చేయాలని జీవో తీసుకొచ్చింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను కాంగ్రెస్ ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసి రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు అమలుకు కార్యచరణ సిద్ధం చేసింది. బీసీ, ఎస్సీ,ఎస్టీలకు కేటాయించిన తర్వాతే మిగిలిన స్థానాలు జనరల్ కేటాయించి.. అందులో మొత్తం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించనుంది. వాళ్ళ లెక్కన జిల్లా వ్యాప్తంగా మొత్తం రిజర్వేషన్ సిస్టం మారుతుంది. దీంతో స్థానిక పోరు ఎన్నికల్లో ఏ గ్రామం, మండలం, జిల్లాలో ఎవరికి రిజర్వేషన్ కేటాయించబడతాయని పలువురు ఆశావహవులు ఆసక్తిగా ఎదురుచూపులు చూస్తున్నారు. రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి జిల్లా జడ్పీ చైర్మన్ల కు రిజర్వేషన్లు ఖరారు చేయగా, జిల్లా స్థాయిలో కలెక్టర్లు జెడ్పిటిసి ఎంపీపీ, ఎంపీటీసీలో స్థానాలకు రిజర్వేషన్లు కేటాయిస్తారు..