calender_icon.png 24 September, 2025 | 4:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతుకమ్మ కుంటకు పునర్వైభవం

24-09-2025 12:48:09 AM

  1.   26న సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
  2. ఏర్పాట్లను పరిశీలించిన హైడ్రా కమిషనర్
  3. హైడ్రా పనితీరుపై మాజీ ఎంపీ వీహెచ్ ప్రశంసల జల్లు

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): ఒకప్పుడు చెత్తాచెదారంతో నిండి, కబ్జాలకు గురై తన ఉనికిని కోల్పోయిన అంబర్‌పేటలోని బతుకమ్మ కుంట నేడు సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగకు వేదికగా నిలవబోతోంది. ఈ నెల 26న సీఎం రేవంత్ రెడ్డి ఈ జలాశయాన్ని నగర ప్రజలకు అంకితం చేయనున్న నేపథ్యంలో, హైడ్రా  కమిషనర్ ఏవీ రంగనాథ్ మంగళవారం రాత్రి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించారు.

26వ తేదీ నాటికి కుంటతో పాటు పరిసర ప్రాంతాలన్నీ పం డుగ వాతావరణాన్ని ప్రతిబింబించేలా, అత్యంత సుంద రంగా తీర్చిదిద్దాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అనంతరం, కుంటలో ఏర్పాటు చేసిన బోటులో విహరించి, సుందరీకరణ పనులను పరిశీలిం చారు.

ఆయన వెంట కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి హనుమంతరావు, హైడ్రా అడ్మిన్ ఎస్‌పిఆర్ సుదర్శన్ కూడా బోటు షికారులో పాల్గొన్నారు. హైడ్రా పనితీరును వి హనుమంతరావు ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను చిత్తశుద్ధితో, వేగం గా పూర్తి చేసి, బతుకమ్మ పండుగ నాటికి కుంటను సిద్ధం చేయడం అభినందనీయమని కొనియాడారు. 

హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ

భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌లో నాలాల ఆక్రమణలు, ముంపు సమస్యలపై హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి మొత్తం 49 ఫిర్యాదులు అందగా, వాటిలో 30కి పైగా నాలాల ఆక్రమణలు, వరద ముంపునకు సంబంధించినవే కావడం గమనారం. నాలాలను ఆక్రమించుకోవడం వల్ల వరద నీరు సాఫీగా ప్రవహించక తమ నివాస ప్రాంతాలు నీట మునుగుతున్నాయని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

చెరువులను కలుపుతూ ఉండే నాలాలు కబ్జాలకు గురికావడంతో, ఎగువ నుంచి వచ్చే వరద నీరు నేరుగా చెరువుల్లోకి వెళ్లకుండా కాలనీలను ముంచెత్తుతోందని ఫిర్యాదు చేశారు. చెరువుల తూములు మూసివేయడం కూడా ముంపునకు ఒక కారణంగా పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన హైడ్రా కమిషనర్, వాటి పరిష్కార బాధ్యతలను సంబంధిత అధికారులకు అప్పగించారు. కొన్ని ప్రాంతాలను తాను స్వయంగా సందర్శించి సమస్యను పరిశీలిస్తానని ఫిర్యాదుదారులకు హామీ ఇచ్చారు.