15-11-2025 12:23:21 AM
* బాలల దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ లో శాంతి కపోతం ఎగురవేత
* బాలల హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలని పిలుపు
* హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): నేటి బాలలే దేశ భవిష్యత్ అని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్ లైన్, యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీస్, ఎఫ్ఎంఎంఎస్ఎస్ఎస్, డాన్ బాస్కో నవజీవన్ సమన్వయంతో కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా సంక్షేమ అధికారి జె. జయంతి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ... బాల్యం అందమైనదని, ఆ అనుభూతిని ప్రతి బాలుడికి, బాలికకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికిపై ఉన్నది.
బాల్యదశ నుండే సత్ ప్రవర్తన, మానవతా విలువలు పెంపొందించి సన్మార్గంలో నడిపిస్తే బాలల దేశ భవిష్యత్ కు పునాది పడుతుందని అన్నారు. బాలల హక్కులకు భంగం కలుగకుండా, లింగ వివక్షత లేకుండా చూడాల్సిన అవసరం ప్రతి వ్యక్తిపై, కుటుంబం వ్యవస్థపై ఆధారపడి ఉందని, ఆ దిశగా కృషి చేస్తే నేటి బాలలను రేపటి ఆదర్శ సమాజ నిర్మాతలుగ తీర్చి దిద్దాలని అన్నారు.ఈ సందర్భంగా ఐసిడిఎస్ హనుమకొండ ప్రాజెక్ట్ పరిధి అంగన్వాడీ ప్రీ స్కూల్ చిన్నారులు ప్రదర్శించిన నృత్యాన్ని చూసి పిల్లలను అభినందించి వారికి బహుమతులు ప్రదానోత్సవం చేసి, శాంతి కపోతం, బెలూన్లు ఎగురవేసారు. జిల్లా సంక్షేమ అధికారి జె జయంతి మాట్లాడుతూ 14 నవంబర్ నుండి 20 వరకు వారాంతపు కార్యక్రమాలు, బాలల సంరక్షణ కేంద్ర బాల బాలికలకు చిత్రలేఖనం, వ్యాస రచన, వక్తృత్వం, సింగింగ్, డాన్సింగ్ లాంటి పోటీలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.
కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు, సిడిపివో ఎం.విశ్వజ, బాల రక్షా భవన్ కో ఆర్డినేటర్ సీహెచ్.అవంతి, యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అదనపు అధికారి డాక్టర్ టి.మదన్ మోహన్ రావు, జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఇన్చార్జి అధికారి ఎస్. ప్రవీణ్ కుమార్, చైల్డ్ లైన్ కో ఆర్డినేటర్ ఎస్. భాస్కర్, డాన్ బాస్కో నవజీవన్ అసిస్టెంట్ డైరెక్టర్ పి. సంతోష్ కుమార్, సఖి వన్ స్టాప్ సెంటర్, జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయ సిబ్బంది, మహిళా సాధికారత కేంద్రం అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడి టీచర్లు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, ట్రైనీ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.