calender_icon.png 23 August, 2025 | 7:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫెడరేషన్ నాయకులతో చిరంజీవి భేటీ

19-08-2025 01:59:35 AM

వేతనాల పెంపు విషయమై పక్షం రోజులుగా సినీకార్మికులు సమ్మె చేస్తున్నారు. షూటింగులు రోజుల కొద్దీ నిలిచిపోవటంతో నిర్మాతలకు ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఇప్పటికే చివరి దశ షూటింగ్, విడుదల తేదీ ప్రకటించేసిన చిత్రాలపై సమ్మె ప్రభావం ఎక్కువగా పడనుంది. ఈ జాబితాలో అగ్ర నటుడు చిరంజీవి 157వ సినిమా కూడా ఉంది. పలుమార్లు ఫిల్మ్ ఫెడరేషన్, ఛాంబర్, నిర్మాతల మధ్య చర్చలు జరిగాయి. ఇంకా జరగాల్సిన చర్చలు అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో అగ్ర నటుడు చిరంజీవి స్వయంగా ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నాయకులతో సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఫెడరేషన్‌లోని ప్రతి యూనియన్‌తో విడివిడిగా మాట్లాడుతూ, వారి సమస్యలను తెలుసుకున్నారు. సమావేశం అనంతరం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేని విలేకరులతో మాట్లాడారు. “ఈ రోజు చిరంజీవి మమ్మల్ని పిలిచి మాట్లాడారు. 24 విభాగాల్లోని 72 మంది నాయకులతో చర్చించారు. నిర్మాతలు మా మాట వినకుండా మా మీదే నిందలు వేస్తున్నారని ఆయన దృష్టికి తీసుకెళ్లాం.

సాధ్యం కాని, అమలు చేయలేని నిబంధనలు పెడుతున్నారని తెలిపాం. నిర్మాతలు ప్రతిపాదించిన రెండు షరతులకు అంగీకరిస్తే మేం నష్టపోతామని చిరంజీవికి వివరించాం. ఆదివారం డబుల్ కాల్షీట్ గురించీ విన్నవించాం. చిరంజీవి అందరి సమస్యలనూ ఓపికగా విన్నారు. ‘మీకు ఏ సమస్య వచ్చినా నా దగ్గరకు రండి’ అని చిరంజీవి భరోసా ఇచ్చారు. మేం  మంగళవారం జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటుచేస్తాం. ఛాంబర్ నుంచి కూడా మాకు పిలుపు వచ్చింది. చర్చలకు పిలిచారు కాబట్టి, ప్రస్తుతానికి నిరసన కార్యక్రమాలు ఆపేశాం. మేం అడిగినట్టు వేతనాలు వస్తాయని భావిస్తున్నాం” అన్నారు.