24-12-2025 12:30:58 AM
వేడుకలలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
సిద్దిపేట, డిసెంబర్ 23 (విజయక్రాంతి): మానవుని రూపంలో ఉన్న దేవుడు యేసు క్రీస్తు అని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఏసుక్రీస్తు కృప వల్ల గౌరవెల్లి ప్రాజెక్టు త్వరగా పూర్తి అయి కాలువలతో సాగునీటినందించి ఈ ప్రాంతమంతా శశశ్యామలం కావాలని, మెడికల్ కళాశాలలో ఉన్నత విద్య ఏర్పాటు చేసేందుకు, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శక్తిసామర్థ్యాలను ఇవ్వాలని ఏసుక్రీస్తు కోరుతున్నట్లు చెప్పారు.
క్రిస్మస్ పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకొని ఒకరినొకరు గౌరవించుకోవాలని కోరారు. కేక్ కట్ చేసి క్రైస్తవులందరికీ ముందస్తుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఏకైక పండగ క్రిస్మస్సేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, వివిధ గ్రామాల సర్పంచులు, పాస్టర్లు పాల్గొన్నారు.