24-12-2025 12:29:42 AM
కొల్చారం, డిసెంబర్ 23 :విద్యార్థులు పదవ తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించేలా నాణ్యమైన బోధన అందాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఉపాధ్యాయులకు సూచించారు. మంగళవారం కొల్చారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థుల సామర్ధ్యాలను ప్రశ్నలు జవాబుల రూపంలో పరీక్షించారు. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు.
అక్కడ జరుగుతున్న విద్యాబోధన, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు గుణాత్మకమైన విద్య బోధన అందించడంతో పాటు సమయానికి నాణ్యమైన ఆహార పదార్థాలను అందించాలన్నారు. పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పాఠశాలల తరగతి గదులు, పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచి, పిల్లలకు అనువైన వాతావరణాన్ని కల్పించాలని,
పరీక్షలు సమయం సమీపిస్తున్న తరుణంలో ఉత్తీర్ణత శాతం మెరుగు పర్చుటకు ప్రత్యేక క్లాసులను నిర్వహించి, పిల్లలలో ఏకాగ్రతను పెంచుటకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి, వారి అభ్యున్నతికి పాటుపడాలని టీచర్లను కలెక్టర్ ఆదేశించారు. పరీక్షల సమయం దగ్గర పడుతున్నందున విద్యార్థులు కష్టంగా కాకుండా ఇష్టంగా చదివి మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.