16-12-2024 12:49:56 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 15 (విజయక్రాంతి): భారతదేశంలో కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకూ విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని యశోద హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ గోరుకంటి రవీందర్ రావు పేర్కొన్నాఉ. ఈ క్రమంలో హైటెక్ సిటీలోని యశోద హాస్పిటల్‌లో దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకోసం ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్’ సీకేడీ క్లినిక్‌ను ఆదివారం జగద్గురు శ్రీ శివరాత్రి దేశికేంద్ర మహా స్వామీజీ తో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో గౌరవ అతిథులు జస్టిస్ ఆర్ దేవదాస్ (కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి), రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి పాల్గొన్నారు.
గోరుకంటి రవీందర్ రావు మాట్లాడుతూ.. భారతదేశంలో ప్రతీ సంవత్సరం దాదాపు 5 లక్షల మంది కొత్త కిడ్నీ రోగులు డయాలసిస్ దశకు చేరుకుంటున్నారన్నారు. వీరిలో కేవలం ఇరవై వేల మంది రోగులకు మాత్రమే కిడ్నీ మార్పిడి అవుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో జనాభాలో 20% కంటే ఎక్కువ మందిలో ఈ ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్’ ప్రాబల్యం పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయని అన్నారు.
యశోద హాస్పిటల్స్- హైటెక్ సిటీ, సీనియర్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజశేఖర చక్రవర్తి మాట్లాడుతూ.. క్రానిక్ కిడ్నీ డిసీజ్ ప్రమాదంలో ఉన్న వారందరూ ఈ క్లినిక్‌లో తమ పేరు నమోదు చేసుకోవచ్చని చెప్పారు. సీనియర్ నెఫ్రాలజిస్ట్ కన్సల్టేషన్‌తో సహా ప్రోటోకలైజ్డ్ కేర్, డైటీషియన్ అత్యాధునిక పరికరాలు, మందులను ఉపయోగించి సీకేడీ నిర్వహణకు సలహా ఇస్తారన్నారు. రోగి త్వరగా క్లినిక్‌కు వచ్చినట్లయితే, క్రానిక్ కిడ్నీ డిసీజ్ పురోగతిని నివారించడం సాధ్యపడుతుందని డాక్టర్ రాజశేఖర చక్రవర్తి తెలిపారు.