22-11-2025 09:48:35 PM
తుర్కయంజాల్: కార్మిక హక్కులను హరించేలా కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌ల నోటిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ నేతలు డిమాండ్ చేశారు. సీఐటీయూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధి బ్రాహ్మణపల్లి చౌరస్తాలో సాగర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు డి.కిషన్ మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడ్‌లను సీఐటీయూ వ్యతిరేకిస్తోందని అన్నారు. కార్మికుల ప్రయోజనాలను తుంగలో తొక్కేలా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. బీజేపీ బరితెగించి కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు కొమ్ముకాస్తోందని మండిపడ్డారు.
కార్మికులను కట్టుబానిసలుగా మార్చి వారి శ్రమను దోచుకునేలా వ్యవహరిస్తున్నారన్నారు. కార్మికులు సృష్టించిన సంపదను కొల్లగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేబర్ కోడ్‌లను వెంటనే ఉపసంహరించుకోకపోతే దేశవ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ తుర్కయంజాల్ మున్సిపల్ కన్వీనర్ యం.సత్యనారాయణ, నాయకులు పగిళ్ల మధు, మద్దెల యాదయ్య, ఆటో యూనియన్ నాయకులు జక్కా హనుమంత్ రెడ్డి, సామ వెంకట్ రెడ్డి, గుండా బాలరాజ్, బండ బీరప్ప, హరీష్, యాదగిరి, గుడ్ల రాజు తదితరులు పాల్గొన్నారు.