11-07-2025 12:00:00 AM
- అఖిలపక్షంతో ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచాలి
- రిజర్వేషన్లు పెంచకుండా ఎన్నికలు నిర్వహించొద్దు
- మంత్రి పొన్నం ప్రభాకర్‌కు జాజుల శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి
హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): క్యాబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల పెం పు విషయంలో రాష్ర్ట ప్రభుత్వం స్పష్టమైన విధానం ప్రకటించాలని బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీకి అఖిలపక్ష బృందాన్ని తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. గురువారం జాజుల శ్రీనివాస్‌గౌడ్ నేతృత్వంలోని బీసీ నాయకుల బృందం మంత్రి పొన్నం ప్రభాకర్‌తో భేటీ అయింది.
రాష్ర్ట ప్రభుత్వం తాత్కాలిక పద్ధతిన బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం జీవో తీసుకురావాలని ఆలోచిస్తున్నదని, కానీ భవిష్యత్తులో న్యాయపరం గా ఈ జీవో నిలబడదనే విషయాన్ని ప్రభు త్వం గ్రహించాలన్నారు. బీసీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధత రావాలంటే తమిళనాడు తరహాలోనే తొమ్మిదో షెడ్యూ ల్లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని చేర్చి, విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచాలని వివరించారు.
ఈనెల 21వ తేదీ నుంచి ఢిల్లీలో జరిగే పార్లమెంట్ సమావేశాలను వేదికగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి బీసీ రిజర్వేషన్లు పెంచేవిధంగా ప్రభుత్వ కార్యాచరణ ఉండాలని సూచించారు. బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. మంత్రి పొన్నం స్పందిస్తూ.. బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో కుందారం గణేశ్‌చారి, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, కనకాల శ్యామ్ పాల్గొన్నారు.