11-07-2025 11:47:51 PM
ఎంఎల్ఏ ప్రేమ్ సాగర్ రావు
లక్షేట్టిపేట,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి ఈ నెల 13న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర ఆబ్కారీ, మద్యనిషేధ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నారని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, డి.సి.పి. ఎగ్గడి భాస్కర్, ఎ.సి.పి. ప్రకాష్, దండేపల్లి, మంచిర్యాల, హాజీపూర్ మండలాల తహశిల్దార్లు రోహిత్ దేష్పాండే, రఫతుల్లా, శ్రీనివాసరావు దేశ్పాండే, మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్, పంచాయతీరాజ్ ఇంజనీర్ రామ్మోహన్ రావులతో కలిసి లక్షెట్టిపేట ఆసుపత్రిని, దండేపల్లి మండలం రెబ్బెనపల్లి గ్రామంలో నిర్వహించనున్న కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంఎల్ఏ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 13న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పర్యటించనున్నారని, అధికారులు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని కోరారు. మధ్యాహ్నం 12 గంటలకు లక్షెట్టిపేట మండల కేంద్రంలో అధికారులు, అనధికారులతో సమావేశమై 12.10 గంటలకు ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారితో కలిసి భోజనం చేస్తారని, మధ్యాహ్నం 2 గంటలకు దండేపల్లి మండలం రెబ్బెనపల్లి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి సోలార్ ప్రాజెక్టు (పైలెట్ ప్రాజెక్టు)కు శంఖుస్థాపన చేసి, బహిరంగ సభలో పాల్గొంటారని తెలిపారు.
సాయంత్రం 4 గంటలకు హాజీపూర్ మండలం వేంపల్లిలో ఇండస్ట్రియల్ పార్క్ శంఖుస్థాపన చేసి ప్రజలతో మాట్లాడతారని తెలిపారు. సంబంధిత శాఖల అధికారులు వారికి కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. లక్షెట్టిపేట మండల కేంద్రంలోని 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ఉన్నత పాఠశాలలను లక్షెట్టిపేట మున్సిపల్ కమీషనర్ సంపత్ కుమార్, మండల తహశిల్దార్ దిలీప్ కుమార్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి సరోజ లతో కలిసి పరిశీలించారు. ప్రముఖుల పర్యటన ఉన్నందున పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.