07-01-2026 12:02:56 AM
కలెక్టర్ ఇలా త్రిపాఠి
నిజామాబాద్, జనవరి 6 (విజయ క్రాంతి): ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) సన్నాహక ప్రక్రియను ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో పక్కాగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు ఉన్నందున ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా తుది ఓటరు జాబితాను పక్కాగా రూపొందించాలని అన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఎస్.ఐ.ఆర్ అమలు తీరు, ముసాయిదా ఓటరు జాబితాపై కలెక్టర్ మంగళవారం నగర పాలక సంస్థ సమావేశ మందిరంలో ఏ.ఈ.ఆర్.ఓలు, బీ.ఎల్.ఓ సూపర్వైజర్లతో సమీక్ష నిర్వహించారు.
ఒక్కో పోలింగ్ కేంద్రం వారీగా ఎస్.ఐ.ఆర్ అమలును పరిశీలిస్తూ, పనితీరులో వెనుకంజలో ఉన్న ఏ.ఈ.ఆర్.ఓలు, బీ.ఎల్.ఓ సూపర్వైజర్లను కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం నియమ, నిబంధనలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలని, అర్బన్ సెగ్మెంట్ పరిధిలోని 301 పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎస్.ఐ.ఆర్ అమలులో స్పష్టమైన ప్రగతి సాధించాల్సిందేనని స్పష్టం చేశారు. ఎస్.ఐ.ఆర్ సన్నాహక అమలులో అర్బన్ సెగ్మెంట్ వెనుకంజలో ఉందని, ఈ పరిస్థితిలో మార్పు తేవాలన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రం వారీగా బీఎల్‌ఓలతో మ్యాపింగ్ ను పక్కాగా జరిపించాలని, అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా నిశిత పరిశీలన జరపాలని ఆదేశించారు. ఎస్.ఐ.ఆర్ సన్నాహక ప్రక్రియ అమలులో పురోగతిపై తాను వారాంతంలో మళ్ళీ సమీక్ష నిర్వహిస్తానని అన్నారు.
ఓటరు జాబితా రూపకల్పనలో ఎలాంటి తప్పిదాలు ఉండకూడదని, ఒత్తిళ్ళు, ప్రలోభాలకు లొంగకుండా పూర్తి పారదర్శకంగా జాబితా ఉండాలన్నారు. ఓటరు జాబితాపై ఏవైనా ఫిర్యాదులు వస్తే సంబంధిత బీ.ఎల్.ఓలు, సూపర్వైజర్లను బాధ్యులుగా పరిగణిస్తామని హెచ్చరించారు. ఓటరు జాబితాను ఏ.ఈ.ఆర్.ఓలు, ఈ.ఆర్.ఓలు కనీసం 5 శాతం మేరకైనా ర్యాండమ్ గా చెక్ చేయాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జాబితాలో బోగస్ ఓటర్లు ఉండరాదని, అదే సమయంలో అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా జాబితా నుండి తప్పిపోకూడదని అన్నారు. కొత్తగా విలీనం అయిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ, క్షేత్రస్థాయిలో నిశిత పరిశీలన జరపాలని కలెక్టర్ హితవు పలికారు. సవాలుతో కూడుకుని ఉండే ఎన్నికల విధులను ఎంతో అప్రమత్తతో నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్రకుమార్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.