09-01-2026 05:13:30 PM
ప్రపంచ స్థాయి విద్య లక్ష్యంగా భారత్ చేస్తున్న ప్రయాణంలో అగ్రగామిగా నిలిచిన బిట్స్ పిలాని
బిట్స్ పిలానీలో అంతర్జాతీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ
జవహర్ నగర్,(విజయక్రాంతి): ప్రపంచ స్థాయి విద్య లక్ష్యంగా భారత్ చేస్తున్న ప్రయాణంలో అగ్రగామిగా నిలిచిన బిట్స్ పిలానీ అని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. బిట్స్ పిలానీకి చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పూర్వ విద్యార్థుల సమ్మేళనం, 'బిట్సా గ్లోబల్ మీట్' (బీజీమ్ 26) ఆరో ఎడిషన్ శుక్రవారం హైదరాబాద్‌లోని బిట్స్ (బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్) పిలానీ క్యాంపస్‌లో ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఈ సదస్సును అధికారికంగా ప్రారంభించారు.
గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఎఫ్ ఎ సి ) కార్మిక, ఉపాధి, శిక్షణ మరియు కర్మాగారాల (ఎల్ యి టీ,ఎఫ్ ) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ (ఐఏఎస్), బీజీఎం 2026 ఛైర్‌పర్సన్ అనిత సాకూరు, బిట్స్ గ్రూప్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వి. రామగోపాల్ రావు, ఇన్వెంటస్ క్యాపిటల్ పార్టనర్స్ ఎంజెల్ ఇన్వెస్టర్ కన్వల్ రేఖి బీజీఎం 2026 చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మయూర్ పట్నాలా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి గవర్నర్ కు పుష్ఫగుచ్చం అందించి స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ బిట్స్ పిలానీ కేవలం విద్యా ప్రతిభతో మాత్రమే పరిమితం కాదని తరతరాలుగా నూతన ఆవిష్కరణలు, నైతిక విలువలు, నాయకత్వ లక్షణాలు, భయంలేని జిజ్ఞాసను పెంపొందిస్తూ వస్తోందని అన్నారు. నేడు విద్య ఒక కీలక మలుపుతో కృత్రిమ మేధస్సు (ఎఐ), డేటా సైన్స్, ఆటోమేషన్, డిజిటల్ మార్పులు విద్యా వ్యవస్థను మౌలికంగా మలుస్తున్నాయి. ఎఐ ఇక భవిష్యత్తు కల కాదని, ఇది ఇప్పటికే విద్య, పాలన, ఆరోగ్య రంగం, పరిశ్రమలు, మానవ జ్ఞానాన్ని ప్రభావితం చేస్తోందని, తద్వారా విద్య కేవలం ఉద్యోగాల కోసం కాకుండా, మార్పులకు అనుగుణంగా ఎదగగల సామర్థ్యం, జీవితాంతం నేర్చుకునే దృక్పథాన్ని యువత అలవరచుకోవాలన్నారు.
ఎఐ డేటాను విశ్లేషించగలదు, నిర్ణయాలు తీసుకోగలదు, కానీ మానవ విచక్షణ, నైతికత, సృజనాత్మకత, కరుణకు అది ప్రత్యామ్నాయం కాదని, కాబట్టి విద్య లక్ష్యం యంత్రాలతో పోటీ పడడం కాకుండ సమాజ హితానికి సాంకేతికతను దారి చూపగల మానవ విలువలను బలోపేతం చేయడం ఎంతో అవసరమన్నారు. బిట్స్ పిలానీ ఈ ఆలోచనను విద్యా స్వయం ప్రతిపత్తి, అనువైన పాఠ్య ప్రణాళికలు, అంతరశాఖీయ అధ్యయనం, ప్రాయోగిక విద్య ద్వారా సాకారం చేస్తోందని శ్లాఘించారు. తెలంగాణ రాష్ట్ర సాంకేతిక వ్యవస్థతో అనుసంధానమై, ఆధునిక పదార్థాలు, బయోటెక్నాలజీ, వాతావరణ పరిష్కారాలు, రోబోటిక్స్, ఎఐ వంటి రంగాల్లో విశిష్టంగా ఎదుగుతుందన్నారు.
ఇలాంటి కేంద్రాలు భారతదేశాన్ని కేవలం సాంకేతిక వినియోగదారుడిగా కాకుండా, స్థానిక అవసరాలకు అనుగుణమైన ఆవిష్కరణల సృష్టికర్తగా నిలుపుతున్నాయన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థులనుద్దేశించి మాట్లాడతూ బిట్స్ పిలానీ విశిష్ట పూర్వ విద్యార్థులకు నా అభినందనలు వారి విజయాలే సంస్థ వారసత్వానికి ప్రతీకలన్నారు. జాన్ ఎఫ్. కెన్నెడీ చెప్పినట్లు విశ్వవిద్యాలయాలకు పూర్వవిద్యార్థుల సంఘాలే ప్రాణవాయువని, అవే జ్ఞాన జ్యోతిని తరతరాలకు అందిస్తాయన్నారు. వారి మార్గదర్శనం, దానధర్మాలు, సంబంధాలు సంస్థ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నాయన్నారు. విద్య వినయాన్ని ఇస్తుందని, వినయం అర్హతను కలిగిస్తుందని, అర్హత సంపదను ఇస్తుందని, సంపద ధర్మానికి దారి తీస్తుందని, ధర్మం సుఖాన్ని ఇస్తుందని, ఈ సూత్రం దానధర్మాలకు మార్గదర్శకంగా ఉండాలని ఆశించారు.
మీ విజయాలు భారతీయ విలువలతో కూడిన ఆవిష్కరణలకు ప్రేరణగా నిలుస్తున్నాయని, వృత్తి నైపుణ్య శిక్షణ, స్వావలంబన పరిశ్రమలు, ప్రతిభ పెంపకంలో మీ సహకారం కోసం దేశం ఆశగా ఎదురు చూస్తోందని అన్నారు. యువతకు మార్గదర్శకులుగా నిలిచి, సమాజాన్ని ఉద్ధరించి, జాతీయ స్వయం సమృద్ధిని ముందుకు నడిపించండడంలో మీ వంతు సహాకారాన్ని అందించాలన్నారు. దాన కిశోర్ మాట్లాడుతూ.. సాంకేతికత మరియు నాణ్యమైన విద్య ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. వర్క్‌ఫోర్స్ డెవలప్‌మెంట్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ నిరంతర అభ్యాసంలో బిట్స్ వంటి సంస్థలు జాతీయ భాగస్వామిగా ఎలా సహకరిస్తున్నాయో ఆయన వివరించారు. బీజీఎం 2026 ఛైర్‌పర్సన్ అనిత సాకూరు మాట్లాడుతూ, ఈ సదస్సు వివిధ తరాల మధ్య సహకారానికి ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. మొదటి రోజు ముగింపులో ఇన్‌స్టిట్యూట్ వారసత్వాన్ని మరియు స్నేహాన్ని చాటిచెప్పే సంప్రదాయ 'ఖవ్వాలీ' ప్రదర్శనతో కూడిన సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించారు.