09-01-2026 05:57:49 PM
* స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు
* మడికొండ టెక్స్ టైల్ పార్క్ అభివృద్ధికి 11 కోట్ల నిధులు
వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు
హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): వర్ధన్నపేట నియోజకవర్గంలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి 46వ డివిజన్ మడికొండ కాకతీయ టెక్స్ టైల్ పార్కులో శుక్రవారం టి.జి.ఐ. ఐ.సి కార్పొరేషన్ ద్వారా 11 కోట్ల రూపాయల నిధులతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు శంకుస్థాపన చేశారు. అనంతరం కాజీపేట మండల పరిధిలోని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఏడుగురు లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మడికొండ కాకతీయ టెక్స్ టైల్ పార్క్ ప్రాంతం పరిశ్రమల అభివృద్ధికి కీలక కేంద్రంగా మారుతుందని ఇక్కడ మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, రూ.11 కోట్ల నిధులతో అంతర్గత రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం జరగడం వల్ల పరిశ్రమదారులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని, వర్షాకాలంలో నీటి సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయని, టెక్స్ టైల్ రంగం అభివృద్ధి చెందుతే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వర్ధన్నపేట నియోజకవర్గ పరిశ్రమల హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ఎక్కడ రజీపడబోమని నిర్ణీత కాలవ్యవధిలో పనులు పూర్తయ్యేలా అధికారులను ఆదేశించారు. టెక్స్ టైల్ పార్కులో దశలవారీగా మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. పూర్తిస్థాయిలో టెక్స్ టైల్ పార్క్ లో ఉన్న కార్మికుల కోసం అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా భోజన సదుపాయం ఏర్పాటు చేస్తానని అలాగే త్వరలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో సమావేశం నిర్వహించి పూర్తిస్థాయిలో అన్ని వసతులు కల్పించి పార్కులో ఇండస్ట్రియల్ నడిచే విధంగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు.