calender_icon.png 10 January, 2026 | 7:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిషేధిత చైనా మాంజాపై పోలీస్ పంజా

09-01-2026 06:02:06 PM

విస్తృతంగా మాంజా దుకాణాల్లో తనిఖీలు

ఫలించిన పోలీసుల కృషి

బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో పోలీసులు ఈసారి చైనా మాంజా వినియోగంపై ప్రత్యేక నిఘా ఉంచారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గాలిపటాలకు వినియోగించే మాంజాపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రత్యేక ఆదేశాల మేరకు మంచిర్యాల డీసీపీ భాస్కర్ నేతృత్వంలో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పర్యవేక్షణలో బెల్లంపల్లి సబ్ డివిజన్ పరిధిలో మందమర్రి, కాసిపేట, తాండూర్, నేన్నెల, కన్నెపల్లి, భీమిని,వేమనపల్లి మండలాల్లో చైనా మాంజా వినియోగంపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు.

ప్రధాన పట్టణంలో గాలిపటాల దుకాణాల ను తనిఖీలు చేశారు. దుకాణదారులకు చైనా మాంజాను విక్రయించరాదని అవగాహన కల్పించారు. చైనా మాంజా ప్రాణాంతకమైందని ప్రచారం చేస్తున్నారు. చైనా మాంజా మినహించి ఇతర ఏమాంజనైనా గాలిపటాలకు వినియోగించుకోవచ్చని పోలీసులు చెబుతున్నారు. దుకాణాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కట్టుదిట్టమైన తనిఖీలు చేస్తున్నారు. బెల్లంపల్లిలో సీఐ శ్రీనివాసరావు, టూ టౌన్ ఎస్ఐ కిరణ్ కుమార్, తాండూర్ లో సిఐ దేవయ్య, దేవపూర్ లో ఎస్సై గంగారం, మందమర్రి సర్కిల్ లో ఎస్ఐ రాజశేఖర్ మాంజా దుకాణాలను ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు.

చైనా మాంజా వినియోగంపై పోలీసులు చేపట్టిన అవగాహన కార్యక్రమం ఫలప్రదం అయిందని చెప్పొచ్చు. ఈ దఫా సంక్రాంతి పండుగ సందర్భంలో గాలిపటాలకు చైనా మాంజాను  ఎవరూ వినియోగించడం లేదు. గాలిపటాలు ఎగురవేసే ఉత్సాహంలో ప్రజలు, ముఖ్యంగా యువత తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేయవద్దని పోలీసులు మోటివేషన్ చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో శుక్రవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో నిషేధిత చైనా మాంజా (నైలాన్/సింథటిక్ దారం) వాడకంపై కఠినంగా వ్యవహరిస్తామని దుకాణదారులను  మరీ హెచ్చరించారు.