12-10-2025 12:21:46 AM
రకరకాల ఫుడ్ ఐటమ్స్‌తో మెనూ
వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు
ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థుల ఆకలి తీర్చేందుకు రాష్ట్రప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరం నుంచి సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని పునః ప్రారంభించనుంది. వచ్చే విద్యాసంవత్సరం ఆరంభం జూన్ 12 నుంచి తిరిగి అమలు కానున్నది. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను విద్యాశాఖ ఇప్పటికే రాష్ట్రప్రభుత్వానికి అందజేసింది. ఇటీవల తమిళనాడు ప్రభుత్వం చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వ హించిన విద్యా పునరుజ్జీవ వేడుకకు హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. తమిళ నాడు తరహాలో తెలంగాణలోనూ ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు చేస్తామని ప్రకటించారు.
అయితే.. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు చేసింది. 2023 అక్టోబర్ 6న రంగారెడ్డి జిల్లా రావిర్యాల జడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నాడు పథకం ప్రారంభమైంది. తర్వాత ఆ పథకం అనేక కారణాలతో కొన్ని పాఠశాలల్లోనే అమలైంది. తర్వాత అసెంబ్లీ ఎన్నికలు రావడంతో అర్ధంతరంగా నిలిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు సరిగా విడుదల కాకపోవడంతో ఆ పథకానికి ఫుల్‌స్టాప్ పడింది.
మళ్లీప్పుడు తాజాగా దీన్ని అమలు చేయాలని సీంఎ రేవంత్‌రెడ్డి నిర్ణయించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా అన్ని సర్కార్ బడుల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్నది. పైలట్ ప్రాజెక్ట్‌గా సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం కూడా సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో అమలవుతున్నది.
తీరనున్న విద్యార్థుల ఆకలి..
రాష్ట్రంలో మొత్తంగా 24,227 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా.. వీటిలో ప్రాథమిక పాఠశాలలు 16,448, ప్రాథమికోన్నత పాఠశాలలు 3,102, ఉన్నత పాఠశాలలు 4,677. అన్ని పాఠశాలల్లో కలిపి సుమారు 20 లక్షల మంది వరకు చదువుతున్నారు. వీరిలో ఎక్కువ మంది నిరుపేద కుటుంబాలకు చెం దిన వారే. ఎక్కువ కుటుంబాల్లో పిల్లలు ఏమీ తినకుండానే పాఠశాలలకు వస్తుంటారు.
తమ తల్లిదండ్రులు తెల్లవారు జామునే పనులకు పోవడం, ఆర్థికపరిస్థితి బాగోలేకపోవ డమే అందుకు కారణం. ఈసమస్యను గుర్తించిన ప్రభుత్వం పిల్లలకు అల్పాహారం ఇవ్వా లని నిర్ణయించింది. తద్వారా పిల్లల్లో రక్తహీనతను నివారించాలని బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయనున్నది. వచ్చే విద్యాసంవత్సరం ఆరంభం (జూన్ 12న) పునః ప్రారం భం కానున్నది.
సర్కార్ ఒక్కో హైస్కూల్ విద్యార్థి అల్పాహారానికి రోజుకు రూ.12, ఒక్కో ప్రాథమిక విద్య చదువుతున్నవ విద్యార్థికి రూ.8 చొప్పున వెచ్చిం చనున్నది. మధ్యా హ్న భోజన వడ్డిస్తున్న బ్రేక్‌ఫాస్ట్ బాధ్యతలనూ అప్పగించింది. అందుకు గాను వారికి నెలకు రూ.500 చొప్పున గౌరవ వేతనమివ్వనున్నది. మధ్యాహ్న భోజనానికి ఇప్పటికే వారికి నెలకు రూ.3 వేలు అందుతున్నది.. మొత్తం కలిపి రూ.3,500 చొప్పున అందనున్నది. వంట సరుకులు, సిలిండర్, స్టౌవ్ వంటివి ప్రభుత్వమే సమకూర్చనున్నది.
మెనూ ఇలా..
వారంలో మూడురోజులు కిచిడీ, పులిహోర, వెజ్ బిర్యానీ వడ్డింపు. మరో రెండు రోజులు వేర్వేరు తరహాల్లో ఉప్మా ఐటమ్స్. మరొక రోజు ఇడ్లీ, వడ, బోండ, పూరీ వంటి అల్పాహారాల్లో ఏదో ఒకటి.