07-08-2025 10:35:11 PM
మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం..
చేవెళ్ల: సీఎం రేవంత్ రెడ్డి పాలన పక్కన పెట్టి బీసీ రిజర్వేషన్ల పేరుతో టైం పాస్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం(Former MLA KS Ratnam) విమర్శించారు. గురువారం చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ.. అలవి కాని హామీలతో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్... పాలనను గాలికొదిలేసిందని మండిపడ్డారు. నియోజకవర్గం రోడ్లు అధ్వానంగా మారాయని, తాగునీటి సరఫరా సరిగ్గా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వాపోయారు. గెలిచిన పార్టీని, గెలిపించిన ప్రజలను వదిలేసి కాంగ్రెస్ లో చేరిన యాదయ్య దిక్కుమాలిన రాజకీయాలు చేయడం తప్ప, ఈ ప్రాంతానికి ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు.
మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన చేవెళ్లలో చేసిన ఒక్క శాశ్వత అభివృద్ధి పనేంటో చూపించాలని, తాను చర్చకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేవెళ్లలో బస్ డిపో కోసం ఏర్పాటు కోసం కృషి చేశానని, 15 ఏండ్లు దాటినా పునాది రాయి కూడా వేయలేరని మండిపడ్డారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న రెసిడెన్షియల్ స్కూళ్లకు శాశ్వత భవనాలు కట్టించలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి పనులు ప్రారంభించాలని, మొయినాబాద్ లో మోడల్ స్కూల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి గుండన్నగారి వెంకట్ రెడ్డి, చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అత్తెల్లి అనంత్ రెడ్డి, మండల అధ్యక్షుడు శ్రీకాంత్, నేతలు డాక్టర్ మల్గారి వైభవ్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, పత్తి సత్యనారాయణ, అశోక్, జయసింహ, మల్లారెడ్డి, గణేష్, కార్యకర్తలు పాల్గొన్నారు.