13-07-2024 12:00:00 AM
9 అంశాలపై చర్చించనున్న రేవంత్‌రెడ్డి
కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎస్ ఆదేశాలు
హైదరాబాద్, జూలై 12 (విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల 16 ఉదయం 9.30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు పాల్గొననున్నారు. మొత్తం 9 అంశాలపై సమావేశంలో సీఎం అధికారులతో చర్చించనున్నారు. ఆయా అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలతో అధికారులు హాజరుకావాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లకు శుక్రవారం సీఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులతో సమావేశమైన సీఎం తాజాగా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లతో సమావేశం కానుండడం గమనార్హం. ప్రధానంగా అంజెండాలో ప్రజాపాలన, ధరణి, వ్యవసాయం, ఆరోగ్యం వ్యాధులు, వనమహోత్సవం, మహిళా శక్తి, విద్య, శాంతిభద్రతలు, డ్రగ్స్ నిర్మూలన క్యాంపెయిన్ అంశాలు ఉన్నాయి.
క్షేత్రస్థాయిలో కలెక్టర్లు పర్యటించాలి
ఇటీవల జరిగిన అన్నిశాఖల ముఖ్యకార్యదర్శుల సమావేశంలో అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి పలు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. క్షేత్రస్థాయిలో పాలనా వ్యవ్యస్థను మరింత పటిష్ఠం చేసేందుకు కలెక్టర్లు కృషి చేయాలని పేర్కొన్నారు. కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని, తాను వారానికో జిల్లాలో పర్యటించి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమీక్షిస్తానని గతంలో తెలిపారు. ఈ నేపథ్యంలోనే సీఎస్ జిల్లా కలెక్టర్లకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాల్లో అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై తనిఖీ చేయాలని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా ఆస్పత్రులను సందర్శించి అక్కడ అందుతున్న వైద్య సేవలను తెలుసుకోవాలన్నారు.
సరిపడా సిబ్బంది, మందులు, మౌలిక వసతులు ఉన్నాయా? తెలుసుకోవాలన్నారు. పాఠశాలల్లో నాణ్యమైన విద్య విద్యార్థులకు అందుతుందా లేదా తెలుసుకోవాలని ఆదేశించారు. పాఠశాల పరిస్థితి, సరిపడా టీచర్లు బడుల్లో ఉన్నారా లేదో చూడాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం పకడ్బందీగా అమలవుతుందా చూడాలన్నారు. హాస్టళ్లను సైతం కలెక్టర్లు సందర్శించాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో మంచినీటి సరఫరా సరిగా జరుగుతుందా తెలుసుకోవాలని సూచించారు. శానిటేషన్, మరుగుదొడ్ల నిర్వహణ, ఇతర అంశాలపై వివరాలు సేకరించాలని ఆదేశించారు.
అలాగే రైతులకు విత్తనాలు, ఎరువులు సరిగా అందుతున్నాయా తెలుసుకోవాలని ఆదేశించారు. పీడీఎస్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు ఆహార పదార్థులు అందుతున్నాయా లేదో వివరాలు సేకరించాలని ఆదేశించారు. అదేవిధంగా రోడ్లు, ప్రజారవాణా, పెన్షన్లు, సంక్షేమ పథకాలు, అంగన్వాడీ సెంటర్ల పనితీరు, సంక్షేమ హాస్టళ్లను నేరుగా వెళ్లి తనిఖీ చేయాలని ఉత్తర్వుల్లో సీఎస్ పేర్కొన్నారు. స్థానిక ప్రజలతో మమేకమై సమస్యలను అడిగి తెలుసుకోవాలని ఆదేశించారు. ప్రతినెల 5వ తేదీలోపు నివేదికను సమర్పించాలని కోరారు. కలెక్టర్లతోపాటు జిల్లా అధికారులు సైతం గ్రామాల్లో, పట్టణాల్లో పర్యటించాలని సీఎస్ ఆదేశించారు.