25-10-2025 10:28:08 PM
-గ్రామీణ యువతకు ఉపాధి కల్పనకు ప్రభుత్వం విశేష కృషి
-మెగా జాబ్ మేళాలో 259 స్టాల్స్
-20,463 అభ్యర్థులు హాజరు.
-3041 అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక
-1533 ఇంటర్వ్యూ లిస్ట్ లో ఎంపిక
- 4574 నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు
- ఆదివారం జరగాల్సిన మెగా జాబ్ మేళా వాయిదా..
- ప్రైవేట్ కంపెనీలు ఇతర ప్రాంతాలలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నందున మెగా జాబ్ మేళా వాయిదా
-రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హుజూర్ నగర్ (విజయక్రాంతి): గ్రామీణ యువతకు ఉపాధి కల్పనకు ప్రజా ప్రభుత్వం విశేష కృషి చేస్తుందని, హుజూర్ నగర్ జాబ్ మేళా భారతదేశంలోనే అరుదైన కార్యక్రమం అని రాష్ట్ర పౌరసరఫరాలు, నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి ఉత్తమ్ మాట్లాడారు... ఆదివారం జరగాల్సిన మెగా జాబ్ మేళాలో ప్రైవేటు కంపెనీలు ఇతర ప్రాంతాలలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నందున వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. సుమారు 275 కంపెనీలు హుజూర్ నగర్ కు వచ్చి 259 స్టాల్స్ నిర్వహించి, 20,463 అభ్యర్థులు హాజరై, 3041 అభ్యర్థులు సెలెక్ట్, 1533 ఇంటర్వ్యూ లిస్ట్ లో ఎంపిక, 4574 నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే పేరుపొందిన కంపెనీలు ఈ జాబ్ మేళాకు హాజరయ్యాయని తెలిపారు.
మెగా జాబ్ మేళాకు రావాల్సిందిగా తాను స్వయంగా కంపెనీల ప్రతినిధులతో మాట్లాడటం జరిగిందని ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగయువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని విస్తృత ప్రచారం కల్పించామని, అందుకు తగ్గట్టుగానే భారీ స్పందన వచ్చిందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించిందని, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని పోస్టులు నింపాలనే దృఢ సంకల్పంతో ఉన్నారని, అందులో భాగంగానే పబ్లిక్ అండర్ టేకింగ్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా 20 నెలల కాలంలో 75000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే,ఈ జాబ్ మేళా ద్వారా ప్రైవేట్ రంగంలో సైతం పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే సంకల్పంతో జాబ్ మేళా నిర్వహించామని తెలిపారు.
గ్రామీణ ప్రాంతంలో సరైన ఉద్యోగ అవకాశాలు లేకపోవడం, తెలుగు మీడియంలో చదవడం వల్ల గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు అవకాశాలు తక్కువగా ఉంటాయని,ప్రత్యేకించి తండాలు, హరిజన ,గిరిజన, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఈ జాబ్ మేళా ద్వారా గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించే అవకాశం దొరికిందని, ఇలాంటి జాబ్ మేళాల ద్వారా ప్రజల జీవితాల్లో సమూల మార్పులను తీసుకురావచ్చని, ఉద్యోగాలు కల్పించడం ద్వారా కుటుంబాలు బాగుపడతాయని ఆయన అన్నారు. జాబ్ మేళాను విజయవంతం చేయడంలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఎక్స్చంజ్ ఆఫ్ తెలంగాణ, సింగరేణి కాలరీస్, జిల్లా యంత్రాంగం, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రంగాలు,సహకరించిన అందరికి మంత్రి ఉత్తమ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇంటర్వ్యూలకు హాజరైన వారు ఉద్యోగాల్లో చేరేవరకు తాము నిరంతరం పర్యవేక్షిస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.