28-08-2025 10:22:26 PM
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కొత్తగూడెం పట్టణ పరిధిలోని పాత కొత్తగూడెం పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ జయలక్ష్మి(District Medical and Health Officer Dr. Jayalakshmi) ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యశాలలో అందుతున్న ఆరోగ్య సేవలు గూర్చి డాక్టర్ రాకేష్ ను అడిగి తెలుసుకున్నారు. ఔట్ పేషెంట్లు, ఇన్ పేషంట్ల సేవలు తెలుసుకున్నారు. అత్యవసర మందులు అందుబాటులో ఉంచుకోవాలని తెలియజేశారు, లాబరేటరీలో చేస్తున్న పరీక్షలు, గర్భిణీల నమోదు, గర్భిణీల సేవలపై వాకబు చేశారు, ప్రతి గర్భిణీ స్త్రీకి సికిల్ సెల్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్నారు. అర్హులైన పిల్లలకు గర్భిణీలకు వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వాలని, మధుమేహం, రక్తపోటు వారికి క్రమం తప్పకుండా మందులు అందించవలన్నారు. 30 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఎన్సీడీ స్క్రీనింగ్ నిర్వహించవలనీ సూచించారు.
మానసిక రుగ్మతలతో బాధపడే వారి కోసం టెలిమానస్ సేవలు ఉపయోగించుకోవాలన్నారు.వయోవృద్ధుల కోసం ప్రభుత్వ ఆసుపత్రి కొత్తగూడెం నందు పాలి యేటివ్ కేర్ సేవలు అందుబాటులో ఉన్నాయని క్యాన్సర్ కేసులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారి కోసం పాలియేటు కేర్ సేవలు ఉపయోగించు కోవాలని తెలియజేశారు. పాత కొత్తగూడెం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రహరి గోడ , డ్రగ్ స్టోర్ మరమ్మత్తుల గురించి అంచనాలు తయారు చేసి పంపించాలని డాక్టర్ రాకేష్ ని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో రాకేష్, రాంప్రసాద్, సౌమ్య ఫార్మసిస్ట్, జయంతి నర్సింగ్ ఆఫీసర్, నాగమణి పాల్గొన్నారు.