07-07-2025 05:37:48 PM
ఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దేశ రాజధాని ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ(Union Minister Mansukh Mandaviya)తో సీఎం భేటీ అయ్యారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా పోటీలు తెలంగాణలో నిర్వహించడానికి అవకాశం ఇవ్వాలని కేంద్రమంత్రిని కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రమంత్రిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా ఖేలో ఇండియా(Khelo India) గేమ్స్, 40వ జాతీయ క్రీడలు, ఇతర జాతీయ, అంతర్జాతీయ క్రీడలను తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించడానికి అవకాశం ఇవ్వాలని సీఎం రేవంత్ కోరారు. అలాగే, ఖేలో ఇండియా పథకం కింద క్రీడాకారుల శిక్షణ, క్రీడా వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని కేంద్రమంత్రిని విజ్ఞప్తి చేశారు. జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు గతంలో మాదిరే రైలు ప్రయాణ ఛార్జీల్లో రాయితీ కల్పించాలని విన్నవించారు.