12-08-2025 07:49:54 PM
హైదరాబాద్: టీజీఐసీసీసీ(TGICCC)లో అన్ని జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సిబ్బందిని అప్రమత్తం చేయాలని, వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకొని పనిచేయాలని ఆదేశించారు. భారీ వర్షాలు ఉన్న జిల్లాలకు ముందే సిబ్బందిని తరలించాలని, అలాగే భారీ వర్షాల దృష్యా అన్ని శాఖల ఉద్యోగులకు సెలవులు రద్దు చేయాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించేందుకు హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేసి, సేవలకు వైద్యులను సిద్ధంగా ఉంచాలని ముఖ్యమంత్రి కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
హైదరాబాద్ లో వరద ప్రభావిత ప్రాంతాలకు ప్రజలు వెళ్లకుండా చూడాలని, కంట్రోల్ రూమ్ ద్వారా అధికారులను అప్రమత్తం చేయాలన్నారు. వర్షాలు, వరదలపై వీడియా ద్వారా సమాచారం చేరవేయాలని, భారీ వర్షాలు, రెడ్ అలర్డ్ ఉన్న జిల్లాల్లో సీనియర్ అధికారులను నియమించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల కుంభవృష్టి వల్ల భారీ నష్టం వాటిల్లుతోందని, పట్టణాల్లో 24 గంటల్లో 2 సెం.మీ వర్షపాతానికి సరిపోయే వ్యవస్థ ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
రెండు గంటల్లో 30,40 సెం.మీ వర్షపాతం నమోదైతే మన వ్యవస్థ సరిపోతదన్నారు. విద్య సంస్థల సెలవులపై తగు చర్యలు తీసుకోవాలని, ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేలా అప్రమత్తం చేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. వీలైనంత వరకు ప్రజలు రహదారులపైకి రాకుండా చూడాలని, ప్రాణ నష్టం, ఆస్తినష్టం, పశు సంపద నష్టం జరగకుండా చూడాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. జంట నగరాల్లో పాత భవనాల నుంచి ప్రజలను ఖాళీ చేయించాలని, విద్యుత్ నిలిచిపోతే వెంటనే పునరుద్ధరించే పనులు చేపట్టాలని సీఎం వివరించారు.