12-08-2025 10:06:52 PM
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు సీతారాం..
ఎల్బీనగర్: అఖిల భారత విద్యార్థి సమైక్య(AISF) 90వ వార్షికోత్సవాలను మంగళవారం హస్తినాపురంలో బాతరాజు భవాని అధ్యక్షతన నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకుడు సీతారాంగ ఏఐఎస్ఎఫ్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ... భారత దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ అన్నారు. దేశ స్వాతంత్రమే లక్ష్యంగా విద్యార్థి సంఘంగా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్, ఆజాద్ ఇతర వీరుల ఆశయ సాధన కోసం ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో బబృద్దీన్, ప్రేమ్ నారాయణ భార్గవ్ నాయకత్వంలో 1936 ఆగస్టు 12న ఏఐఎస్ఎఫ్ ఆవిర్భవించిందని చెప్పారు.
బ్రిటీష్ సామ్రాజ్యవాదుల బానిస చేర నుంచి మాతృభూమి విముక్తి కోసం సాగిన వీరోచిత స్వాతంత్య్ర ఉద్యమంలో ఎందరో విద్యార్థులు బలిదానం చేశారన్నారు. స్వాతంత్య్రానంతరం ప్రభుత్వ విద్యా పరిరక్షణ, శాస్త్రీయ విద్య, కామన్ విద్యావిధానం అమలుపై 89 సంవత్సరాలుగా నిరంతరం ఏఐఎస్ఎఫ్ పోరాడుతుందన్నారు. సరూర్ నగర్ మండల కార్యదర్శి వినోద్ మాట్లాడుతూ.. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడంలో విఫలమైందన్నారు. ఫీజు రియంబర్స్ మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. బీఎన్ రెడ్డి నగర్ లోని ఎయిడెడ్ కళాశాల అధ్వానంగా ఉందని, సరూర్ నగర్ జూనియర్ కళాశాలకు ప్రహారి నిర్మించాలని కోరారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు సంతోష్, రేణుక, ఉష, సాయి, విద్యార్థులు పాల్గొన్నారు.