12-08-2025 09:54:51 PM
16న ఏఐకెఎస్ పట్టణ మహాసభ
సిపిఐ పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య
కొత్తగూడెం (విజయక్రాంతి): కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో త్రాగునీటి సమస్య, పారిశుధ్యంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి శాశ్వత పరిస్కారం చూపాలని, శంకుస్థాపనలు పూర్తయిన రోడ్లు, డ్రైన్లు, ప్రభుత్వ భవనాలను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని సిపిఐ కొత్తగూడెం పట్టణ కార్యదర్శి కంచర్ల జమలయ్య(CPI Secretary Kancharla Jamalaiah) అధికారులను కోరారు. సిపిఐ జిల్లా కార్యాలయం 'శేషగిరిభవన్'లో మంగళవారం జరిగిన సిపిఐ కొత్తగూడెం పట్టణ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వర్షాలు కురుస్తుండటంతో పారిశుద్ధ్యం లోపించి ప్రజలు అనారోగ్యం భారినపడే ప్రమాదం ఉందని తక్షణమే అధికారులు ప్రత్యేక డ్రైవులు ముమ్మరంగా చేపట్టాలని, పట్టణంలో త్రాగునీటి సమస్య ఉన్న వార్డులు, బస్తీలను గుర్తించి సమస్యకు పరిష్కరించాలన్నారు.
ఈనెల 16న కొత్తగూడెం పట్టణ ఏఐకెఎస్ మహాసభ నిర్వహిస్తున్నామని, పట్టణ పరిధిలోని రైతులు పాల్గొనాలని సూచించారు. దీంతోపాటు యువజన, విద్యార్థి, గిరిజన సమాఖ్య, ఏఐటీయూసీ పట్టణ మహాసభలు నిర్వహించబోతున్నామని ఈ మహాసభలను ఆయా సంఘాల పట్టణ బాధ్యులు విస్తృతంగా ప్రచారం నిర్వహించి సభలను విజయవంతం చేయాలనీ సూచించారు. గెడ్డాడు నగేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నాయకులు మాచర్ల శ్రీనివాస్, నేరెళ్ల రమేష్, భూక్యా శ్రీనివాస్, నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, తదితరులు పాల్గొన్నారు.