12-08-2025 10:22:03 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) మరిపెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బురహానపురంలో తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగింది. గ్రామానికి చెందిన గడ్డం వెంకటరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 9న వేములవాడ రాజరాజేశ్వరి స్వామి దర్శనానికి వెళ్లారు. ఇంటికి తాళం వేసి వెళ్ళిన వీరి ఇంటి తలుపులకు వేసిన తాళం తెరిచి ఉండటం, కిటికీ అద్దాలు పగలగొట్టడం గమనించారు. వెంటనే బాధితులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఇంటికి చేరుకున్న వెంకటరెడ్డి కుటుంబం బీరువాలో ఉన్న రూ.50 వేల నగదు, నాలుగు తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించారు. ఈ మేరకు బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజ్‌కుమార్ గౌడ్, ఎస్‌ఐ సతీష్, కోటేశ్వరరావు క్లూస్ టీంతో సహా సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు ప్రారంభించారు.