22-07-2025 06:55:16 PM
ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జుట్టు గజేందర్..
నిర్మల్ (విజయక్రాంతి): రాష్ట్రంలో నూతన పీఆర్సీ అమలుకు ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ తీసుకోవాలని ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జుట్టు గజేందర్(STU State Associate President Juttu Gajender) అన్నారు. నిర్మల్ రూరల్ మండలంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్.భూమన్న యాదవ్, జె. లక్ష్మన్ లతో కలిసి సంఘ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. పీఆర్సీ గడువు ముగిసి నేటికి రెండేళ్లయిందని, వెంటనే అమలు చేయాలని అన్నారు. ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతుల అంశం వివాదాస్పదంగా మారుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరహాలో ప్రత్యేక యాక్ట్ రూపొందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సమస్యలపై ఎప్పటికప్పుడు ఎస్టీయూ రాజీలేని పోరాటాలు చేస్తుందని అన్నారు. పెండింగ్ డిఏలు, ట్రెజరీ బిల్లులు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. మేనిఫెస్టో హామీ మేరకు సిపిఎస్ రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నాయకులు భూక్యా రమేష్, మండల బాధ్యులు తాళ్ళ రవి, నాందేవ్ తదితరులు పాల్గొన్నారు.