02-12-2025 12:07:57 AM
అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్యా నాయక్
వనపర్తి, డిసెంబర్ 1 (విజయక్రాంతి ): జిల్లాలోని రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి సమర్పించాల్సిన పెండింగ్ సి.ఎం.ఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) డెలివరీ వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ రెవిన్యూ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. సోమవారం మదనపూర్ మండలంలోని భాను ట్రేడ్స్ రైస్ మిల్లును అదనపు కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన రైస్ మిల్లులో నిల్వ ఉన్న ధాన్యం మరియు మిల్లింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు.
అనంతరం మిల్లు యజమాన్యంతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు కస్టమ్ మిల్లింగ్ రైస్ (సి.ఎం.ఆర్.) ను ఎప్పటికప్పుడు వేగంగా పూర్తి చేసి ప్రభుత్వానికి డెలివరీ చేయాలని ఆదేశించారు. డెలివరీలో ఎలాంటి జాప్యం జరగకుండా చూడాలని స్పష్టం చేశారు.
కొనుగోలు కేంద్రాల నుండి మిల్లుకు వచ్చిన ధాన్యం లారీలను వెంటనే అన్లోడ్ చేయాలని, దీనివల్ల కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం నిల్వలు పెరగకుండా, ప్రక్రియ నిరాటంకంగా కొనసాగడానికి వీలవుతుందని తెలిపారు. ధాన్యం కొనుగోలులో రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా, మొత్తం ప్రక్రియ సజావుగా సాగేందుకు రైస్ మిల్లుల యజమానులు పూర్తి సహకారం అందించాలని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఈ సందర్భంగా కోరారు.