23-05-2025 01:46:44 AM
సీఎంకు ఘనంగా స్వాగతం పలుకుదాం
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
జహీరాబాద్, మే 22 : ఈనెల 23న సీఎం పర్యటన ఏర్పాట్లు పూర్తి అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షట్కార్, కలెక్టర్ క్రాంతి వల్లూరు, శాసనసభ్యులు సంజీవరెడ్డితో కలిసి గురువారం ఏర్పాట్లను పరిశీలించారు. హెలిపాడ్, సీఎం చేతుల మీదుగా ప్రారంభించే బసవేశ్వర విగ్రహం, నిమ్జ్ రోడ్, కేంద్రీయ విద్యాలయ భవనం, సభ స్థలంను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హెలిప్యాడ్ పనులు, ప్రజా వేదిక సభ వేదిక, విఐపి గ్యాలరీ, మీడియా గ్యాలరీ, వాహనాల పార్కింగ్ పనులు, రూట్ల వారీగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రణాళిక వివరాలు, గ్రీనరీ, స్టేజి ఏర్పాట్లు, స్టేజి అలంకరణ, పరిశుభ్రత, మిషన్ భగీరథ తాగునీరు, టాయిలెట్స్ అన్ని పనులు పూర్తి అయ్యాయన్నారు.
సభకు హాజరయ్యే ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట ఎస్పీ పంకజ్ పరితోష్, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, ఆర్డీవోలు, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.