calender_icon.png 8 August, 2025 | 12:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొగ్గు దిగుమతులు తగ్గించాలి

20-07-2024 01:02:35 AM

ఆత్మనిర్భర్ భారత్ సాధించాలి 

సీఐఎల్ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

కోల్‌కతాలో లాండ్‌స్లుడ్స్ ఫోర్‌కాస్టింగ్ సెంటర్ ప్రారంభం

హైదరాబాద్, జూలై 19 (విజయక్రాంతి): బొగ్గు రంగంలో ఆత్మనిర్భరత సాధించే దిశగా మన దేశం ముందుకెళ్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి తెలిపారు. ఇదే తరుణంలో మరింత సానుకూల ఫలితాలు సాధించేందుకు బొగ్గు దిగుమతుల మీద ఆధారపడకుండా దేశీయంగా ఉత్పత్తిని పెంచేందుకు కృషిచేయాలని అధికారులకు సూచించారు.

శుక్రవారం కోల్‌కతాలో కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్) కేంద్ర కార్యాలయాన్ని సందర్శించి ఉద్యోగుల సమావేశంలో మాట్లాడారు. దేశం బొగ్గు రంగంలో సాధిస్తున్న ప్రగతిలో సీఐఎల్ కీలకపాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. రానున్న రోజుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించిన లక్ష్యాలను చేరుకునేందుకు మరింత కష్టపడి పనిచేయాలని సూచించారు. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని కోరారు. దేశీయ అవసరాలకు కొత్త బ్లాకులను గుర్తించి ఉత్పత్తి చేపడుతూనే.. పర్యావరణ పరిరక్షణ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపించాలని ఆయన సూచించారు. 

నేషనల్ ల్యాండ్‌స్లుడ్ ఫోర్‌కాస్టింగ్ సెంటర్ ప్రారంభం

హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్) కేంద్ర కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. దేశంలో రాగి అన్వేషణలో పనిచేస్తున్న ఏకైక సంస్థ అయిన హెచ్‌సీఎల్ రానున్న రోజుల్లో దేశీయ అవసరాలకు తగ్గట్లుగా ఉత్పత్తిని పెంచడంపై దృష్టిపెట్టాలని సూచించారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) కార్యాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొని సంస్థ సాధించిన ప్రగతిని.. రానున్న రోజుల్లో కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేయాల్సిన అవసరాన్ని వివరించారు. జీఎస్‌ఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేషనల్ ల్యాండ్‌స్లుడ్ ఫోర్‌కాస్టింగ్ సెంటర్ (కొండచరియలు విరిగిపడే సూచన కేంద్రం)ను కేంద్రమంత్రి ప్రారంభించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా వర్షాకాలంలో కొండప్రాంతాల్లో మట్టిపెళ్లలు విరిగిపడటం వల్ల జరుగుతున్న ప్రమాదాలను ముందుగానే గుర్తించే విధంగా ఈ కేంద్రం పనిచేస్తుందని తెలిపారు.