calender_icon.png 8 August, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రిమినల్ గ్యాంగ్‌లపై ఉక్కుపాదం

07-08-2025 11:47:46 PM

డ్రగ్స్ మాఫియాను కూకటివేళ్లతో పెకిలించండి

తొలి అర్ధవార్షిక నేర సమీక్షలో డీజీపీ డాక్టర్ జితేందర్

హైదరాబాద్ సిటీబ్యూరో (విజయక్రాంతి): నేర ముఠాలపై ఉక్కుపాదం మోపాలని, రాష్ట్రంలో డ్రగ్స్ జాడ లేకుండా చేయాలని పోలీసు ఉన్నతాధికారులను డీజీపీ డాక్టర్ జితేందర్(DGP Dr. Jitender) ఆదేశించారు. క్రిమినల్ గ్యాంగ్‌లను, డ్రగ్స్ మాఫియాను కట్టడి చేసేందుకు అవసరమైతే కఠిన చట్టాలను ప్రయోగించాలని స్పష్టం చేశారు. గురువారం డీజీపీ కార్యాలయంలో జరిగిన తొలి అర్ధవార్షిక నేర సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. క్రిమినల్ గ్యాంగ్‌లను అరికట్టేందుకు పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు తమ యూనిట్ల పరిధిలో ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. “గత 20 ఏళ్లుగా అనేక మంది గ్యాంగ్ సభ్యులు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు.

అయినా కొత్త ముఠాలు పుట్టుకొస్తున్నాయి. వీరిపై కఠినంగా వ్యవహరించాలి. పార్థీ గ్యాంగ్‌ల తరహాలోనే చెడ్డీ, భవేరియా వంటి ప్రమాదకర ముఠాలపై నిఘా పెంచాలి. నకిలీ విత్తనాలు సరఫరా చేసే వారిపై  పీడీ యాక్ట్ నమోదు చేయాలి. రాష్ట్రంలో డ్రగ్స్ సరఫరా, వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించాలి. యువత డ్రగ్స్ బారిన పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటోంది. వారిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారి మూలాలను గుర్తించి, ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకుని వారిని పట్టుకోవాలి’ అని ఆయన అన్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న పలువురు నైజీరియన్లను అరెస్ట్ చేశామని టీ-న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిల్య వెల్లడించారు.

నూతనంగా వచ్చిన చట్టాలు, మారిన సెక్షన్లపై సీఐడీ డీఐజీ నారాయణ నాయక్ అవగాహన కల్పించారు. దర్యాప్తులో శాస్త్రీయ, ఫోరెన్సిక్ ఆధారాల ప్రాముఖ్యతను గాంధీ మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ కృపా లాల్ సింగ్, ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ వివరించారు. దర్యాప్తులో లోపాలను సరిదిద్దుకోవాలని లీగల్ అడ్వుజర్ అజయ్ కుమార్ సూచించారు. నేరాల నియంత్రణలో సీసీటీఎన్‌ఎస్ కెమెరాల పాత్ర కీలకమని, కీలక ప్రాంతాల్లో తప్పనిసరిగా కెమెరాలు ఏర్పాటు చేయాలని అడిషనల్ డీజీపీ వి.వి. శ్రీనివాసరావు తెలిపారు. సమావేశానికి సీఐడీ అడిషనల్ డీజీపీ చారుసినా అధ్యక్షత వహించారు. టీఎస్‌పీఏ డైరెక్టర్ అభిలాష బిస్త్, డీజీ ప్రిజన్స్ సౌమ్య మిశ్రా, అడిషనల్ డీజీపీలు మహేశ్ ఎం భగవత్, వివి శ్రీనివాసరావు, స్వాతి లక్రా, అనిల్ కుమార్, సంజయ్ కుమార్ జైన్, స్టీఫెన్ రవీంద్ర, మహిళా, శిశు సంక్షేమ శాఖ సెక్రటరీ అనిత రామచంద్రన్, రాచకొండ, సైబరాబాద్ సీపీలు సుధీర్ బాబు,  అవినాష్ మహంతి, మల్టీ జోన్ ఐజీపీలు చంద్రశేఖర్ రెడ్డి, తఫ్సీర్ ఇక్బాల్, అధికారులు, కమిషనర్లు, ఎస్పీలు పాల్గొన్నారు.