calender_icon.png 18 November, 2025 | 2:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లా నినా ప్రభావంతోనే చలిగాలులు

18-11-2025 12:11:46 AM

ఫిరోజ్ ఖాన్ :

తెలంగాణ రాష్ర్టంలో ముఖ్యంగా ఉత్తర ప్రాంతంలోని ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలపై చలిగాలులు పంజా విసురుతున్నాయి. గత పది రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరిగి, రికార్డు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. డిసెంబర్ ప్రవేశించక ముందే ఈ తీవ్రత గ్రామీణ, గిరిజన వర్గాల జీవితాన్ని గజగజ వణికించేస్తోంది. పగటిపూట కూడా ఉష్ణోగ్రతలు తగ్గడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది.

మహారాష్ర్ట, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల నుంచి వీస్తున్న చల్లని గాలుల తాకిడికి ఈ ప్రాంతం అతలాకుతలమవుతోంది. వాతావరణంలో ఈ అసాధారణ మార్పు దీర్ఘకాలిక ప్రజారోగ్య, ఆర్థిక సంక్షోభానికి సంకేతంగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ర్ట ప్రణాళిక అభివృద్ధి సంస్థ, వాతావరణ శాఖ నివేదికల ప్రకారం.. రాష్ర్టంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఈ ఉత్తర జిల్లాల్లోనే నమోదవుతున్నాయి. గత కొన్ని రోజుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 9.1 సెంటిగ్రేడ్‌ల ఉష్ణోగ్రత నమోదవ్వడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.

అలాగే ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సగటున 9.5 నుంచి 11 సెంటీగ్రేడ్‌ల మధ్య రికార్డవుతున్నాయి. కొన్ని అటవీ, మైదాన ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు 8 సెంటీగ్రేడ్‌ల కంటే కూడా తక్కువగా పడిపోవడం గమనార్హం. గత సంవత్సరాల సగటు కంటే అధికంగా ఉన్న ఈ చలిగాలుల తీవ్రత, సాధారణ జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ, రైతులు, విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తోంది.

ఆరోగ్య సమస్యలు..

చలి తీవ్రత పెరుగుతున్న కొద్దీ, ప్రజారోగ్యంపై దాని ప్రతికూల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధుల బాధితులు అధికంగాఏరన ప్రభావితమవుతున్నారు. జలుబు, దగ్గు, ఆయాసం, న్యుమోనియా వంటి వ్యాధులతో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. వైద్య నిపుణుల సూచనల ప్రకారం, అధిక చలి కారణంగా రక్తనాళాలు సంకోచించి, రక్తపోటు పెరుగుతుంది. ఫలితంగా, ఇటీవల గుండెపోటు కేసులు పెరగడం, హృద్రోగులలో సమస్యలు తలెత్తడం ప్రజలలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

చలి వల్ల చర్మం పొడిబారడం వంటి చర్మ సమస్యలు కూడా పెరుగుతున్నాయి. చలికాలంలో అత్యంత ఎక్కువ ఇబ్బందులు పడుతున్న వర్గం ప్రభుత్వ వసతి గృహాలు (హాస్టల్స్), గురుకులాల్లోని విద్యార్థులు. రాష్ర్టవ్యాప్తంగా, ముఖ్యంగా సంగారెడ్డి, సూర్యాపేట వంటి జిల్లాల్లోని సంక్షేమ హాస్టళ్లలో వేడినీటి యంత్రాలు పనిచేయకపోవడం, పూర్తిస్థాయిలో దుప్పట్లు, రగ్గులు పంపిణీ చేయకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం. కనీస మౌలిక వసతులు కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం వైఫల్యం, విధి నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం, తదితర లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

యాసంగిపై అనిశ్చితి.. 

విపరీతమైన చలి వ్యవసాయ రంగంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతోంది. ప్రస్తుతం యాసంగి పంటకు రైతులు సన్నద్ధమవుతున్న తరుణంలో, ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల వరి నారు ఎదుగుదల మందగిస్తోంది. నారుమళ్లు ఆశించినంతగా పెరగకపోవడంతో నారు నాటు ఆలస్యం అవుతుంది. అంతేకాకుం డా, ఉదయం కురుస్తున్న మంచు, పత్తి వంటి పంటల నాణ్యతను దెబ్బతీసి, రైతుల దిగుబడులు మరియు ఆదాయంపై ప్రభావం చూపుతుంది.

కూర గాయల పంటలకు సైతం కాత, పూత తగ్గి దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. చలి తీవ్రతతో పాటు వచ్చే దట్టమైన పొగమంచు రోడ్డు ప్రమాదాలకు దారి తీస్తోం ది. ముఖ్యంగా వేకువజామున, సా యంత్రం వేళల్లో దృశ్యమానత తగ్గిపోవడం వల్ల ఎదురుగా వస్తున్న వాహ నాలు, మలుపులు సరిగా కనిపించకపోవడంతో రహదారిపై ప్రయాణాలు అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయి.

నిపుణులు సూచించిన విధంగా, మంచు ఎక్కువగా కురిసే సమయాల్లో ప్రయాణా లు చేయకపోవడం లేదా అత్యంత నెమ్మదిగా, ఫాగ్ లైట్లు ఉపయోగించి వెళ్లడం తప్పనిసరి. రవాణా, పోలీసు శాఖలు ఈ అంశంపై ప్రత్యేక హెచ్చరికలు జారీ చేసి, నిఘా పెంచాల్సిన ఆవశ్యకత ఉంది.

మూడు రకాలుగా..

శీతల పరిస్థితులకు దారితీసే లా నినా తిరిగి రావడం వల్ల ఈ సీజన్ చలి మరింత తీవ్రతరమవుతుందని ప్రపంచ వాతావరణ సంస్థ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ ఏడాది చివరి నాటికి లా నినా అభివృద్ధి చెందే ఛాన్స్ ఎక్కువగా ఉందని.. దీని ప్రభావం వల్ల తక్కువ ఉష్ణోగ్రతలు, ఎక్కువగా చలి గాలుల వీచే అవకాశముంది. ఇలాంటి వాతావరణ మార్పు గత ఆరేళ్లలో ఇది ఐదోసారి కావడం గమనార్హం. ఒక రకమైన వాతావరణ మార్పునే లానినా అంటారు.

దీన్ని ‘ఎల్‌నినో సదరన్ ఆసిలేషన్’ అని కూడా పిలుస్తారు. దీని ప్రభావం వల్ల సెంట్రల్ ఈస్టర్న్ పసిఫిక్ మహాసముద్రంలో నీటి ఉష్ణోగ్రతలు మారడం, వాతావరణంలో మార్పులు చో టుచేసుకోవడం లాంటివి జరుగుతాయి. లా నినా అనేది ప్రపంచ వాతావరణాన్ని కూడా పూర్తిగా ప్రభావితం చేస్తుంది. ఇది మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి వెచ్చగా (ఎల్‌నినో), రెండోది చల్లగా (లానినా), మూడోది న్యూట్రల్‌గా ఉంటుంది.

ఇది దాదాపు రెండు నుంచి ఏడేళ్ల కాలంలో మళ్లీ మళ్లీ తిరిగి వస్తూనే ఉంటాయి. మరోవైపు లానినా మళ్లీ వచ్చినప్పటికీ ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు మాములు దానికన్నా ఎక్కువగా ఉంటాయని పేర్కొంది. ఎల్‌నినోకు వ్యతిరేక వాతావరణ ప్రభావాలను లా నినా తీసుకొస్తుందని పేర్కొంది. ఉష్ణమండల ప్రాంతాల్లో ఎల్‌నినో, లా నినా సహజంగా జరిగే సంఘటనలని పేర్కొంది. 

నివారణ మార్గాలు.. 

తీవ్రమైన పరిస్థితుల్లో రాష్ర్ట ప్రభుత్వం తక్షణమే స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ యంత్రాంగం తక్షణం చర్యలు చేపట్టాలి. ఆసుపత్రులలో ఉచిత మం దులు, ముఖ్యంగా చలి సంబంధిత వ్యాధుల చికిత్సకు మెరుగైన ఏర్పాట్లు చే యాలి. గుండెపోటు ప్రమాదాలపై విస్తృ త అవగాహన కార్యక్రమాలు నిర్వహించా లి. ఉష్ణోగ్రతల తగ్గుదలను తట్టుకునే వి ధంగా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ అధికారులు సలహాలు అం దించాలి.

ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూడకుండా, పౌరులు వ్యక్తిగతంగా కొన్ని నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా చలి ప్రభావాన్ని తగ్గించుకోవాలి. పెరుగుతున్న చలి, విపరీత వాతావరణ మార్పులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి, ప్రభుత్వ యంత్రాంగంతో పాటు పౌరులు సమన్వయంతో పనిచేయడం అత్యవసరం.

 వ్యాసకర్త సెల్:  9640466464